Polavaram Spillway : పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేలో మిగిలిన ఆరు రేడియల్ గేట్లను నిలబెట్టే ప్రక్రియ పూర్తయ్యింది. స్పిల్‌వేలో 48 గేట్ల అమరిక పనులు 2020 డిసెంబరు 17న ప్రారంభించారు. గతేడాది జూన్‌లో వరదలు వచ్చే నాటికి 42 గేట్లను బిగించి, వాటికి హైడ్రాలిక్ సిలిండర్లను అనుసంధానం చేశారు. మిగిలిన ఆరింటికి సంబంధించి 12 హైడ్రాలిక్ సిలిండర్లను జర్మనీ నుంచి తెప్పించారు. ఈలోగా వరదలు రావడంతో పనులు నిలిచిపోయాయి.
15 రోజుల కిందట వీటికి సంబంధించి పనులు ప్రారంభించి గేట్లు నిలబెట్టారు. వాటికి వెల్డింగ్ చేయడానికి మరో పదిహేను రోజులు పడుతుందని ఈఈ సుధాకరరావు శనివారం తెలిపారు. ఆ పనులు పూర్తి చేసిన తరువాత హైడ్రాలిక్ సిలిండర్లను అమరుస్తామన్నారు. అదీ పూర్తయితే 48 గేట్లు హైడ్రాలిక్ సిలిండర్ల సహాయంతో పని చేస్తాయని తెలిపారు.