Eluru Road: ఇక్కడ వాహనాల వెనుక కనిపిస్తున్నది దట్టమైన పొగమంచో.. ఏదైనా తగులబెడితే వచ్చిన పొగో కాదు. రోడ్డు దుస్థితికి నిదర్శనంగా కమ్ముకున్న దుమ్ము. కంకర తేలిన, గుంతలమయమైన రోడ్డుపై.. ధూళి ధాటికి ఎదురుగా వస్తున్న వాహనం కూడా కనిపించదు. వెనుక ఎవరున్నారో అర్థం కాదు. ఇక్కడ ప్రయాణమంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. తరచూ ప్రమాదాలతో ఆందోళన చెందుతున్నారు.
ఇది తెలంగాణలోని ఖమ్మం జిల్లా తల్లాడ నుంచి ఏలూరు జిల్లా మీదుగా విశాఖ వెళ్లే జాతీయ రహదారి. ఈ మార్గంలో నిత్యం కొన్ని వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు సరకు రవాణాతో పాటు.. పరిశ్రమలకు ముడి సరుకులు చేరవేసేందుకు ఇదే ప్రధాన రహదారి. భారీ నుంచి అతిభారీ వాహనాలు పరుగులు పెడుతుంటాయి. ఏళ్ల తరబడి రహదారుల నిర్వహణ గాలికి వదిలేయడం, రద్దీ పెరగడంతో పెద్దపెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణానికి ఏమాత్రం వీలు కాకుండా తయారైంది.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి బయ్యనగూడెం మీదుగా తాడేపల్లిగూడెం, దేవరపల్లి, రాజమహేంద్రవరం వెళ్లాలంటే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. జాతీయ రహదారిపై జాలీగా వెళ్దామనుకుంటే.. ఏ గుంతలోనో పడి నడుం విరగక తప్పదు. వంకర గోతులను తప్పించేందుకు వాహనదారులు నానాయాతన పడాల్సిందే. ఇక్కడ ఆటోలను తిప్పితే వచ్చే డబ్బు.. రిపేర్లకే సరిపోవట్లేదన్నది డ్రైవర్లంటున్నారు. ఈ రోడ్డుపై నిత్యం ప్రయాణించే వారి పరిస్థితి నరకమనే చెప్పాలి. ప్రత్యామ్నాయ మార్గం లేక ఇటువైపే రావాల్సి వస్తోంది. గంటల తరబడి ప్రయాణంతో ప్రజలు విసిగిపోతున్నారు.