Teacher died విద్యార్థుల బూట్ల గోనె సంచితో ద్విచక్రవాహనంపై వస్తున్న ఉపాధ్యాయుడు అదుపు తప్పి ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాయన్నపాలెం వద్ద గురువారం జరిగింది. ఏలూరులో నివాసం ఉంటున్న జక్కుల రాజశేఖర్ (51) పెదవేగి మండలం చింతలపాటివారిగూడెం ఎంపీపీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు పనిచేస్తున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న బూట్లను తీసుకొచ్చేందుకు గురువారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై పెదవేగిలోని ఎంఈవో కార్యాలయానికి వెళ్లారు. బూట్లున్న గోనెసంచిని ద్విచక్రవాహనంపై ముందు పెట్టుకొని వస్తుండగా, రాయన్నపాలెం గ్రామంలో గోనెసంచి హ్యాండిల్‌కు అడ్డుపడటంతో కిందపడి పోయారు. అదే సమయంలో అటుగా వస్తున్న ట్రాక్టర్.. తల మీదుగా వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రాజశేఖర్ భార్య అరుణ ప్రసన్న పెదవేగి మండలంలోని కొప్పాకలోని ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయిని. వీరికి ఇద్దరు కుమారులు. పెదవేగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ కిందపడి ప్రధానోపాధ్యాయుడి మృతి - ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ
Teacher died ద్విచక్రవాహనంపై విద్యార్దులకు పాఠ్యపుస్తకాలు, బూట్లు తీసుకొస్తుండగా అదుపు తప్పి ట్రాక్టర్ కిందపడి ప్రధానోపాధ్యాయుడు మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర దిగ్బ్రాంతిని వెలిబుచ్చాయి. స్కూల్ టీచర్లపై బయోమెట్రిక్ ఒత్తిడితోనే ప్రధానోపాధ్యాయుడు దుర్మరణం పాలైయ్యాడని వారు ఆరోపించారు.
ఒత్తిడే కారణమంటున్న ఉపాధ్యాయ సంఘాలు :గతంలో పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, బూట్లు, సాక్సులు.. పాఠశాలకు నేరుగా సరఫరా చేసేవారు. ప్రస్తుతం మండల కేంద్రానికి పంపించి ఉన్నతాధికారులు చేతులు దులిపేసుకుంటున్నారు. దీంతో అక్కడి నుంచి నిర్దేశిత పాఠశాలలకు ఆయా ఉపాధ్యాయులే తీసుకువెళుతున్నారు. సామగ్రి వచ్చిన వెంటనే విద్యార్థులకు అందించి వారి తల్లిదండ్రులతో బయోమెట్రిక్ తీసుకుని ఉన్నతాధికారులకు నివేదిక పంపించాలనే ఒత్తిడి ఉంది. ఈ ఒత్తిడితోనే జక్కుల రాజశేఖర్ కాంప్లెక్సుకు వెళ్లి ఆదుర్దాగా తీసుకొస్తుండగా ప్రమాదం జరిగిందని స్పష్టంగా అర్థమవుతోందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ అన్నారు. పాఠశాలలకే నేరుగా విద్యా సామగ్రిని పంపించాలని డిమాండ్ చేశారు. విద్యాసామగ్రి పంపిణీ, ఇతర కార్యక్రమాలతో ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి పెరిగిందని, రాజశేఖర్ మృతికి అధికారులు బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, యూటీఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, నరసింహారావు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: