ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Gudivada Casino issue: గుడివాడ క్యాసినో ఘటనపై డీఐజీకి తెదేపా ఫిర్యాదు - గుడివాడ క్యాసినో ఘటనపై డీఐజీకి తెదేపా ఫిర్యాదు వార్తలు

Gudivada Casino issue: గుడివాడ క్యాసినో ఘటనపై ఏలూరు రేంజ్ డీఐజీకి తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. కార్యాలయంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో.. సిబ్బందికి ఫిర్యాదు కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు.. గుడివాడ ఘటనపై సీఎం జగన్ ఏం చెబుతారని ప్రశ్నించారు.

Gudiwada Casino issue
Gudiwada Casino issue

By

Published : Jan 22, 2022, 3:34 PM IST

Updated : Jan 22, 2022, 4:04 PM IST

Gudivada Casino issue: గుడివాడ క్యాసినో ఘటనపై ఏలూరు రేంజ్ డీఐజీకి తెదేపా నిజనిర్ధరణ కమిటీ సభ్యులు ఫిర్యాదు చేశారు. డీఐజీ అందుబాటులో లేకపోవడంతో.. కార్యాలయ సిబ్బందికి ఫిర్యాదును అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పార్టీ నేతలు.. ప్రభుత్వం తీరుపై ప్రశ్నలవర్షం కురిపించారు. విదేశీ యువతులతో అర్ధనగ్న ప్రదర్శన చేయిస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారన్న తెదేపా నేతలు..జూద క్రీడలు అనుమతించేది లేదని సీఎం చెబుతుంటారని గుర్తు చేశారు. అలాంటింది గుడివాడలో జూద క్రీడపై ఏం చెబుతారని నిలదీశారు. వాస్తవాలు తెలుసుకోవాలని తమ అధినేత కమిటీ వేశారని స్పష్టం చేశారు.

"అనుమతి తీసుకుని గుడివాడకు వెళ్తుంటే అడ్డుపడ్డారు. గుడివాడ తెదేపా కార్యాలయం వద్దే అరెస్టు చేశారు. మా కార్లపై రాళ్లతో దాడి చేశారు. క్యాసినో నిర్వహించలేదంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు. న్యాయపోరాటం చేసైనా విషసంస్కృతికి అడ్డుకట్ట వేయిస్తాం. తెలుగువారి ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారు" - తెదేపా నిజనిర్ధరణ కమిటీ సభ్యులు

పలువురిపై కేసులు నమోదు..

శుక్రవారం గుడివాడ పర్యటనకు వెళ్లిన తెదేపా నేతలపై పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేశారు. ఆరుగురు నిజనిర్ధరణ కమిటీ సభ్యులతో పాటు.. మరో 20 మంది ఇందులో ఉన్నారు. ఇక తెదేపా నేత బొండా ఉమా ఫిర్యాదుతో కొడాలి నాని ఓఎస్డీ శశిభూషణ్​తో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి.

గుడివాడలో ఉద్రిక్తత.. ఏం జరిగిందంటే...

TDP Leaders Arrest in Gudiwada: గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కె-కన్వెన్షన్‌ సెంటర్‌లో సంక్రాంతి సందర్భంగా గోవా తరహాలో క్యాసినో నిర్వహించినట్లు వచ్చిన ఆరోపణలపై తెదేపా నిజనిర్ధారణ కమిటీ కన్వెన్షన్‌ సెంటర్‌ను పరిశీలించాలని నిర్ణయించింది. పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజా, నక్కా ఆనంద్‌బాబు, మాజీ ఎంపీ కొనకొళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తదితరులు మంగళగిరి నుంచి శుక్రవారం ఉదయం 11 గంటలకు బయలుదేరారు. అనుమతి లేదని వీరిని పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నారు. మొదట దావులూరు టోల్‌ప్లాజా వద్ద వాహనాల్లో మారణాయుధాలు ఉన్నాయేమోనని తనిఖీ చేశారు. పామర్రు క్రాస్‌రోడ్డు వద్ద వాహనాలను నిలిపివేశారు. ఒక్క వాహనానికే అనుమతి ఇస్తామనడంతో పోలీసులు, తెదేపా నేతలకు వాగ్వాదం జరిగింది. తర్వాత 10 వాహనాలను అనుమతించారు. మళ్లీ గుడివాడలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. చెక్‌పోస్టు ఏర్పాటుచేసి ఒకే ఒక్క వాహనాన్ని పార్టీ కార్యాలయానికి అనుమతించారు. అప్పటికే కె-కన్వెన్షన్‌ వద్దకు వైకాపా కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కె-కన్వెన్షన్‌ సెంటర్‌ను పరిశీలిస్తామని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు తెదేపా కార్యాలయం నుంచి కాలినడకన బయలుదేరారు. అనుమతి లేదంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు.

తెదేపా కార్యాలయంపై రాళ్ల దాడి..

ఈ సందర్భంగా వైకాపా కార్యకర్తలు తెదేపా కార్యాలయం వైపు దూసుకురావడంతో తెదేపా కార్యకర్తలు, నాయకుల చుట్టూ పోలీసులు వలయాన్ని ఏర్పాటుచేశారు. ఇరువైపులా నినాదాలు మార్మోగాయి. భారీగా ఉన్న వైకాపా కార్యకర్తలు పోలీసుల వలయం ఛేదించుకుని తెదేపా కార్యాలయంపై రాళ్లు విసిరారు. బారికేడ్ల వద్ద ఉన్న బొండా ఉమా కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఆ కారును చూసి.. ఇది వాడి కారేరా అంటూ బూతులు తిడుతూ పోలీసుల సమక్షంలో రాళ్లతో అద్దాలను పగలగొట్టడం కనిపించింది. వైకాపా కార్యకర్తల దాడిలో ముళ్లపూడి రమేష్‌ చౌదరి అనే కార్యకర్త గాయపడ్డారు. తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు రాళ్లదాడులతో పాటు పిడిగుద్దులు గుద్దారు. పోలీసుల ముందే ఈ దాడులు జరుగుతున్నా.. నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఆ సమయంలో గుడివాడ డీఎస్పీ, సీఐలు తమ వద్దకు వచ్చి వైకాపా కార్యకర్తల దాడిని తాము నిలువరించలేమని, అత్యవసరంగా అరెస్టు చేస్తున్నామంటూ తమ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పామర్రు పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు తెదేపా నేతలు తెలిపారు. అనంతరం పట్టణంలో ఉద్రిక్తత సడలింది. పట్టణంలో ర్యాలీగా వెళ్లిన వైకాపా కార్యకర్తలపై పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించలేదు.

అన్ని మార్గాల్లో ముందుగానే..

తెదేపా నిజనిర్ధారణ కమిటీ సభ్యులు గుడివాడ వస్తామని ముందే ప్రకటించడంతో మంత్రి అనుచరులు, వైకాపా కార్యకర్తలు ముందే గుడివాడలో అన్ని మార్గాల్లో సిద్ధంగా ఉన్నారు. వైకాపా ఎస్సీ సెల్‌ విభాగం సమావేశం కె-కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసుకున్నారు. గుడివాడ డీఎస్పీ, ముగ్గురు సీఐలు, పోలీసులు తెదేపా కార్యాలయం వద్ద ఉండి.. కమిటీ సభ్యులను, నాయకులను అక్కడే నిర్బంధించారు. ఈలోపే వైకాపా కార్యకర్తలు వచ్చి దాడికి దిగారు. పోలీసులు వైకాపా కార్యకర్తలకు సహకరించారని, చిన్న పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని వర్ల రామయ్య తీవ్రంగా విమర్శించారు. దీనికి డీజీపీదే బాధ్యతని హెచ్చరించారు.

పోలీసులకు ఫిర్యాదు

వైకాపా కార్యకర్తలు, మంత్రి కొడాలి నాని అనుచరులు తమపై దాడి చేసి హత్యాయత్నం చేశారని పామర్రు పోలీసులకు తెదేపా నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఫిర్యాదుచేశారు. దీనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కొన్ని గంటల తర్వాత వారిని పోలీసులు విడిచిపెట్టారు. వర్ల రామయ్య మాట్లాడుతూ.. ‘మంత్రి కొడాలి నాని విష సంస్కృతి తీసుకొచ్చారు. గోవాను తలదన్నేలా కాసినో ఆడించారు. రూ.10వేల ప్రవేశరుసుము నిజం కాదా? ఇదంతా గుడివాడ పోలీసులకు తెలిసే జరిగింది. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కూ తెలుసు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకు వచ్చాం. ఏం జరగకపోతే పోలీసులు ఎందుకు అడ్డుకోవాలి? మంత్రి అనుచరులు ఎందుకు దాడి చేయాలి? ఇప్పటికీ గోడలపై అశ్లీల చిత్రాలున్నాయి. అదే సాక్ష్యం’ అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. క్యాసినోకు వాడిన పరికరాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంపై ఈడీ దర్యాప్తు చేయాలని డిమాండు చేశారు.

ఇదీ చదవండి:
Maoist : మావోయిస్టుల దుశ్చర్య...12 వాహనాలకు నిప్పు

Last Updated : Jan 22, 2022, 4:04 PM IST

ABOUT THE AUTHOR

...view details