ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏలూరు ఘటనలో ప్రభుత్వం నిజాలు దాస్తోంది: నిమ్మల - eluru latest news

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఘటనలో ప్రభుత్వం నిజాలు దాస్తోందని తెదేపా నేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. నీటిలో తేడా వల్లే వింత వ్యాధి అని వైద్య నిపుణులు స్పష్టంగా చెబుతున్నా.. ప్రభుత్వం మాత్రం నీటి వల్ల కాదని ముందే ప్రకటనలు ఇచ్చిందని దుయ్యబట్టారు. పంపుల చెరువు వద్దకు ఎవరినీ వెళ్లనీయకుండా ఎందుకు ఆంక్షలు పెట్టిందని ప్రశ్నించారు.

nimmala ramanaidu
nimmala ramanaidu

By

Published : Dec 9, 2020, 3:24 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధికి మున్సిపల్‌ నీరు కలుషితమే కారణమని వైద్యులు చెబుతున్నారని తెలుగుదేశం శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు అన్నారు. కొవిడ్‌ వ్యర్థాలను కృష్ణా కాలువలో కలిపేయటమే ఇందుకు ఒక కారణమైతే.. పంపుల చెరువు నీరు తాగటమూ ఈ వ్యాధికి మరో కారణమనే వాదన వినిపిస్తోందన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం నిజాలన్నింటినీ దాస్తూ పంపుల చెరువు వద్దకు ఎవ్వరూ వెళ్లకుండా ఎందుకు ఆంక్షలు పెట్టిందని ప్రశ్నించారు. బుధవారం విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. పశ్చిమగోదావరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన టెండర్లు కావల్సిన వారికి దక్కలేదని రెండుసార్లు రద్దు చేశారని ఆరోపించారు.

తమ అవినీతి కోసం వైకాపా ప్రభుత్వం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోకపోతే ఏలూరు పరిస్థితే రాష్ట్రమంతా వ్యాపిస్తుంది. ప్రతిపక్షాలపై దాడులు, కక్షసాధింపులకు చూపే శ్రద్ధ ప్రజారోగ్యాన్ని కాపాడటంలో లేదు. పది రోజుల క్రితం నుంచే కేసులు నమోదవుతున్నా ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. నీటిలో తేడా వల్లే వింత వ్యాధి అని వైద్య నిపుణులు స్పష్టంగా చెబుతున్నా.. ప్రభుత్వం మాత్రం నీటి వల్ల కాదని ముందే ప్రకటనలు ఇచ్చింది. బాధితుల సంఖ్య తగ్గించుకునేందుకు రోగులను పరిశీలనలో ఉంచకుండా హడావుడిగా డిశ్ఛార్జి చేస్తున్నారు. విజయవాడ, గుంటూరులో ఉండే అత్యవసర విభాగాలు, ప్రత్యేక వైద్య నిపుణుల బృందాలను ఇంతవరకు ఏలూరులో పెట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం- నిమ్మల రామానాయుడు, తెలుగుదేశం శాసనసభాపక్ష ఉపనేత

ప్రజలపై పన్నుల భారం

రాష్ట్ర ప్రజలపై రూ.లక్ష కోట్ల పన్ను భారం మోపేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైందని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. సంస్కరణల పేరుతో కోట్లాది రూపాయలు అప్పుచేస్తూ ఆ భారాన్ని పన్ను రూపంలో ప్రజలపై మోపనున్నారని దుయ్యబట్టారు. వసూలు చేసిన పన్నులలో 20శాతం మేర మాత్రమే సంక్షేమానికి ఖర్చు చేస్తూ 80శాతం జే-ట్యాక్స్‌ రూపంలో జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పెట్టింది వేరు వేరు హామీలంటూ జగన్‌ వింత వాదనలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు పాదయాత్రలో ఆచరణ సాధ్యం కానీ హామీలతో ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన జగన్‌.. ఇప్పుడు మేనిఫెస్టోలో వేరుందనటం ప్రజల్ని మోసగించటమేనని నిమ్మల ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి

ఏలూరులో 583కు చేరిన వింత వ్యాధి బాధితుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details