పశ్చిమగోదావరి జిల్లా ‘ఏలూరులో అంతు చిక్కని వ్యాధి బాధితులకు పూర్తిస్థాయిలో చికిత్స అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.. బాధితులకు శుద్ధజలం అందించాలి. వార్డుల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలి. ఇవన్నీ మీరు చేస్తారా లేక తెదేపా ఆధ్వర్యంలో మమ్మల్ని చేయించమంటారా’ అంటూ తెదేపా త్రిసభ్య కమిటీ సభ్యులు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి సవాల్ విసిరారు. రెండు రోజులు గడువిస్తున్నామని.. మీరు చేయకుంటే తర్వాత తామే చేస్తామని అన్నారు. అంతు చిక్కని వ్యాధి బాధితులను పరామర్శించేందుకు తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు మాజీ హోం మంత్రి చినరాజప్ప, ఎమ్మెల్సీలు బాబూరాజేంద్రప్రసాద్, అశోక్‌బాబు ఆదివారం ఏలూరు వచ్చారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అక్కడ అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. కొత్తపేటలో బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చినా పూర్తిగా కోలుకోలేదని, కళ్లు తిరుగుతున్నాయని నీరసంగా ఉంటుందని.. నిలబడితే పడిపోయేలా ఉందని బాధితులు వివరించారు.
ఎన్టీఆర్ ట్రస్టు తరఫున చికిత్స చేయిస్తాం
చినరాజప్ప మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని విమర్శించారు. నగరంలో 600 మందికిపైగా అంతుచిక్కని వ్యాధి బారిన పడినా.. ఇంకా ఆ వ్యాధికి కారణాలను ప్రభుత్వం తెలుసుకోలేకపోవడం సిగ్గుచేటన్నారు. పూర్తిస్థాయిలో చికిత్స అందించకుండా హడావుడిగా ఇళ్లకు ఎందుకు పంపించారని ప్రశ్నించారు. బాధితుల్లో చాలా మంది ఫిట్స్‌తో కిందపడటంతో బాగా దెబ్బలు తగిలాయన్నారు. కొందరికి ఎముకలు విరిగాయని.. వారికి శస్త్రచికిత్స చేయాల్సి ఉందన్నారు.