సామాజిక దూరం పాటించాలని సాక్షాత్తూ ప్రధానే చెబుతున్నారు. స్వీయ నియంత్రణ ఉండాలని అధికారులు అంటున్నారు. ఇందుకోసం జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్ విధించుకుని నిబంధనలు పాటిస్తున్నాం. అయితే ఉదయం పూట దుకాణాల వద్దకు వచ్చేవారు, అలాగే వాహనాలపై తిరిగే వారు కొందరు ఈ నిబంధనలు అనుసరించడం లేదు. మనకెవరికీ లేదు కదా... మనకు రాదులే... అన్నటువంటి ఆలోచనలతో అజాగ్రత్తగా ఉంటున్నారు. ప్రభుత్వాల మాటలను పెడచెవిన పెట్టిన ఇటలీ, స్పెయిన్ దేశాలు భారీ మూల్యం చెల్లిస్తున్నాయి. అందువల్లే ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి వ్యాప్తిని నివారించటం సులువనే విషయం అందరూ గుర్తించాలి. ఆదివారం జనతా కర్ఫ్యూ విజయంలో కీలక భూమిక పోషించి అందరి ప్రశంసలు అందుకున్నాం. అదే స్ఫూర్తిని అందుకుని స్వీయ నియంత్రణను పాటిస్తూ అధికారులకు సహకరిస్తే కరోనాపై పోరులో మనమూ భాగస్వాములైనట్టే.
అనుసరణీయం
నిత్యావసర దుకాణాలు ఉదయం ఆరు నుంచి 10 వరకూ కూరగాయల దుకాణాలు, చిల్లర దుకాణాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఉంటున్నాయి. అందుకే హడావుడి లేకుండా సామాజిక దూరం పాటిస్తూ సరకులు కొనుగోలు చేసుకునేందుకు వెసులుబాటు లభిస్తోంది. దీన్ని ఉపయోగించుకుని సమదూరం పాటిస్తే అందరికీ క్షేమకరం. ఈ దిశగా ఏలూరులో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముగ్గుతో లైన్లు గీసి, కర్రలతో క్యూలైనట్లు ఏర్పాటు చేసి స్టేడియాల్లో కూరగాయల వ్యాపారులతో విక్రయాలు జరిపించారు. దీనివల్ల కాస్తంత సమయమైనా ఏలూరు వాసులు క్రమశిక్షణతో క్యూలైన్లలో నిలబడి కూరగాయలు కొనుగోలు చేశారు. ఈ విధానాన్ని జిల్లాలోని ప్రధాన పట్టణాల ప్రజలకు కూడా అనుసరణీయమే.