ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Dumping Yard: ఆహ్లాదతీరం.. ఆందోళనమయం - వశిష్ఠ గోదావరి తీరం

Dumping Yard: నదీతీరం ఆ పట్టణానికి వరం.. అక్కడ పుణ్యస్నానాలు ఆచరించవచ్చు.. పితృదేవతలకు పిండప్రదానం చేయవచ్చు.. సాయం సంధ్యవేళలో సరదాగా ఇంటిల్లిపాదీ కాసేపు విహారానికీ వెళ్లొచ్చు.. అదంతా ఒకప్పుడు! ఇప్పుడు అదో డంపింగ్ యార్డ్‌. ఆహ్లాదతీరం ఇప్పుడు చెత్తాచెదారంతో నిండిపోయింది. భరించలేని కంపుకొడుతోంది. ఈ పాపం ఎవరిదో కాదు పురపాలిక అధికారులదే.. ఔను.. ప్రకృతిని పరిరక్షించాల్సిన వాళ్లే పాడు చేస్తున్నారు. అడిగేవాళ్లెవరు అన్నట్లు.. రోజూ టన్నులకొద్దీ వ్యర్థాలను నదీతీరంలో కుమ్మరిస్తున్నారు.

Dumping yard
డంపింగ్ యార్డ్‌

By

Published : Sep 2, 2022, 7:03 PM IST

డంపింగ్ యార్డ్‌

Dumping yard: ఇది నరసాపురం ఒడ్డునున్న వశిష్ఠ గోదావరి తీరం.. ఇది ఒడ్డునే ఉన్న హిందూ శ్మశానవాటిక. ఈ రెండు దృశ్యాల్లోనూ ఓ కామన్‌ సమస్య కనిపిస్తోంది గుర్తించారా.?.. ఐతే.. కొంచెం దగ్గరగా చూడండి... ఇదిగో గుట్టలుగుట్టలుగా పోగుబడిన చెత్తాచెదారమే ఇక్కడి అసలు సమస్య.. ఔను.. చెప్పుకోడానికే ఇది నదీ తీరం. కానీ ప్రభుత్వం దీన్నో డంపింగ్‌ యార్డ్‌గా మార్చేసింది. పట్టణంలో పోగుబడే వ్యర్థాలను.. వాహనాల్లో తీసుకొచ్చిమరీ ఇక్కడ డంప్‌ చేస్తున్నారు.

గోదావరి నది ఒక పాయగా నరసాపురం పట్టణం ఒడ్డున.. వశిష్ఠ గోదావరిగా ప్రవహిస్తుంది. ఇందులో పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. పితృదేవతలకు పిండ ప్రదానాలూ చేస్తుంటారు. ఇక సాయంత్రమైతే పట్టణ వాసులు గోదావరి అందాలు ఆస్వాదిద్దామని ఇక్కడకు వస్తుంటారు. ఆహ్లాదంగా గడుపుదామనే గంపెడాశతో పిల్లలను తీసుకుని వస్తుంటారు. కానీ అలాంటి వారి ఆశలను చెత్తతో కప్పేస్తున్నారు... పురపాలక సంఘం అధికారులు. నదీ పరీవాహకమంతా చెత్తా చెదారం, ప్లాస్టిక్, గాజు ముక్కలతో నిండిపోయింది. పందులు, గేదెలు, ఆవుల సంచారంతో ఆ ప్రాంతమంతా దుర్గంధభరితమైంది. డంపింగ్ యార్డు పక్కనే ఉన్న హిందూ శ్మశానవాటికలో కర్మకాండలు నిర్వహించేందుకు వచ్చేవారు... అక్కడ పట్టుమని పది నిమిషాలు ఉండలేకపోతున్నారు.

"గోదావరి తీరాన్ని పూర్తిగా చెత్తకుప్పగా మార్చేశారు. తిరగడానికి రోడ్డు కూడా మూసుకుపోయింది. ఇంతకుముందు ఇక్కడ మత్స్యకారులు వేటాడే పరిస్థితి ఇక్కడ ఉండేది. ప్రస్తుతం ఇక్కడికి రావాలంటేనే ఇబ్బందిగా ఉంది. చెత్తతో నింపేశారు. ఎక్కడా ఒక్క వల కూడా కట్టలేని పరిస్థితి వచ్చింది. ఎక్కడెక్కడి నుంచో చెత్త అంతా తీసుకొచ్చి పూర్వ కాలం నుంచి పూజించే నదీ ఒడ్డున పారపోస్తున్నారు. ఇది చాలా దారుణం" -స్థానికులు

నరసాపురంలో సేకరించిన చెత్త వాహనాలు నేరుగా నదీ తీరానికే వస్తాయి. అక్కడ డంప్‌ చేస్తాయి. చెత్త పేరుకుపోయి స్థలం చాలడంలేదనుకుంటే.. జేసీబీలతో నేరుగా నదిలోకి నెట్టేస్తున్నారు. ఫలితంగా పవిత్ర గోదావరి కాలుష్యమం అవుతోంది.

కొన్నాళ్ల క్రితం వరకూ పురపాలిక అధికారులు ప్రైవేటు స్థలాన్ని లీజుకి తీసుకుని.. అందులో డంపింగ్ యార్డు నిర్వహించేవారు. లీజు గడువు ముగిసింది. మళ్లీ పొడిగించుకోలేదు. అలాగని... మరోచోట స్థలాన్నీ సేకరించలేదు. తేరగా ఉందికదా అన్నట్లు.. తీరాన్నే డంపింగ్ యార్డుగా మార్చేశారని ప్రజాసంఘాలు, పార్టీలు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్లపై చెత్తపడేస్తే.. ఇళ్లకు వెళ్లి మరీ పురపాలక అధికారులు మందలించిన ఘటనలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. మరి ఇప్పుడు నదీతీరాన్ని నేరుగా కలుషితం చేస్తున్న.. నరసాపురం పురపాలిక అధికారులను ఏమనాలని నరసాపురంవాసులు ఆక్రోశిస్తున్నారు.

డంపింగ్ యార్డ్‌

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details