Shops should close on CM Tour: ఈనెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో పర్యటించనున్నారు. మహిళా కళాశాల ఎదురుగా వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో హెలికాప్టర్ దిగి అక్కడి నుంచి ఆయన బాలుర ఉన్నత పాఠశాలలో జరిగే సభకు చేరుకుంటారు. మార్గమధ్యలో జగన్ పర్యటనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇనుపరాడ్లతో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ సీఎంకు అడ్డుపడకుండా చర్యలు చేపట్టారు.
పర్యటన ముందస్తు చర్యల్లో భాగంగా 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు పట్టణంలోని అన్ని దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తణుకు చాంబర్ ఆఫ్ కామర్స్ తమ పరిధిలోని వ్యాపార వాణిజ్య సంస్థలకు నోటీసు ద్వారా సమాచారం అందించారు. గతంలో ఏ ముఖ్యమంత్రికి లేనివిధంగా పూర్తిస్థాయి భద్రతా చర్యల్లో భాగంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.