పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన నాగార్జున... ఎంబీఏ పూర్తి చేశాడు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే ఈ యువకుడు... కరోనా సమయంలోనూ స్నేహితులతో కలసి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాడు. వలస కూలీలకు ఆహారం, ఆర్థిక సాయం అందించాడు. బంధువులు పట్టించుకోని 18 మంది కొవిడ్ మృతదేహాలకు దగ్గరుండి అంతిమ సంస్కారాలు చేయించాడు.
సేవా కార్యక్రమాల్లో పాల్గొనే క్రమంలో నాగార్జున కూడా కరోనా బారిన పడ్డాడు. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడు. అక్కడే... ప్లాస్మాదానం గురించి తెలుసుకున్నాడు. ప్లాస్మా దానానికి సిద్ధపడ్డాడు. దూరంతో సంబంధం లేకుండా.. ఎక్కడినుంచి ఫోన్‌కాల్ వచ్చినా.. వెంటనే వెళ్లేవాడు. కోలుకున్న తర్వాత ఇప్పటికి 6 సార్లు ప్లాస్మాదానం చేసి సేవాగుణం చాటుకుంటున్నాడు.
నాగార్జున స్ఫూర్తితో...
నాగార్జునకు ఒకటి, రెండేళ్ల వయసున్న ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. కరోనా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో ఇంటికి దూరంగా ఉండేవాడు. తన వల్ల.. కుటుంబ సభ్యులకు, పిల్లలకు ఏం కాకూడదని, స్నేహితుల గదిలో ఉండేవాడు. ఒకవైపు భయంగా ఉన్నప్పటికీ.... తన కొడుకు వల్ల ఒకరి ప్రాణం నిలబడుతున్నందుకు సంతోషంగా ఉందంటున్నారు నాగార్జున తల్లి లక్ష్మీకుమారి. కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందిన సమయంలోనూ స్నేహితుల ద్వారా నాగార్జున సేవా కార్యక్రమాలు నడిపించాడు. తన స్ఫూర్తితో చాలామంది ప్లాస్మాదానం చేయడానికి ముందుకు వస్తున్నారు.