ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏలూరులో వంద మందికి పైగా అస్వస్థత - minister alla nani

ఏలూరు వన్ టౌన్​లో వంద మందికి పైగా ప్రజలు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పలువురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న వైద్యులు వివరాలు సేకరిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు.

westgodavari district
westgodavari district

By

Published : Dec 5, 2020, 7:40 PM IST

Updated : Dec 6, 2020, 11:29 AM IST

ఏలూరులో వంద మందికి పైగా అస్వస్థత

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలో శనివారం ఉన్నట్టుండి 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులు స్పృహ తప్పి పడిపోతుండటంతో వారిని అంబులెన్సుల్లో ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. తొలుత ఒకటో పట్టణ పరిధిలోని దక్షిణ వీధిలో కొందరు అస్వస్థతకు గురవగా.. శనివారం రాత్రికి నగరంలోని పడమరవీధి, కొత్తపేట, తాపీమేస్త్రీ కాలనీ, అశోక్‌నగర్‌, తంగెళ్లమూడి, శనివారపుపేట, ఆదివారపుపేట, అరుంధతిపేట తదితర ప్రాంతాల్లోనూ బాధితుల సంఖ్య పెరిగింది.

శనివారం సాయంత్రం నుంచి రాత్రి 12 గంటల వరకు ఆసుపత్రికి 95 మంది ఇదే రకమైన అస్వస్థతతో వచ్చారని ఏలూరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ చెప్పారు. వీరిలో 22 మంది చిన్నపిల్లలు, 40 మంది మహిళలు 33 మంది పురుషులు ఉన్నారని తెలిపారు. వెంటనే ఆక్సిజన్‌ అందించడంతో కొద్దిసేపటికే తేరుకున్నారని చెప్పారు. కొందరు మూర్ఛ లక్షణాలతో, ఇంకొందరు స్పృహ తప్పి పడిపోయే పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చారని డాక్టర్‌ మోహన్‌ వివరించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో మరికొందరు చికిత్స పొందుతున్నారు.

బాధితుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు. వికారం, మానసిక ఆందోళనతో కూడా పలువురు ఆసుపత్రికి పరుగులు తీశారు. దక్షిణ వీధికి చెందిన ఆరేళ్ల చిన్నారి ప్రభ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

మంత్రి ఆళ్ల నాని

అప్రమత్తమైన యంత్రాంగం
సమాచారం తెలుసుకున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అధికారులతో కలిసి దక్షిణవీధికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అస్వస్థతకు గురైన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని మంత్రి చెప్పారు. బాధితులను ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్సులు, చికిత్స కోసం వైద్యులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామన్నారు. విజయవాడలోనూ అత్యవసర ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని చెప్పారు. విజయవాడ జనరల్‌ ఆసుపత్రి నుంచి పిల్లల వైద్యులు, జనరల్‌ ఫిజీషియన్‌, ఇతర వైద్యులు హుటాహుటిన ఏలూరు వెళ్లారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయమేదీ లేదని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ తెలిపారు.

ఏలూరులోని పలు ప్రాంతాల్లో ప్రజలు అస్వస్థతకు గురవుతుండటంతో సంబంధిత అధికారులతో కలెక్టర్‌ ముత్యాలరాజు శనివారం రాత్రి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. బాధితుల కోసం నగరంలోని రెండు ఆసుపత్రుల్లో 150 పడకలను సిద్ధం చేశామన్నారు. బాధితుల నుంచి నమూనాలు సేకరించి విజయవాడకు పంపించామని, 24 నాలుగు గంటల్లో ఫలితాలొస్తాయని చెప్పారు. మరోవైపు పలు ప్రాంతాల్లో ప్రజలు.. శుద్ధి చేసిన నీటిని తెచ్చుకునేందుకు వాటర్‌ ప్లాంట్ల వద్ద బారులు తీరుతున్నారు.

ఏలూరులో వంద మందికి పైగా అస్వస్థత.. రంగంలోకి వైద్య బృందాలు

కారణమేంటో?
ఇంతమంది ఒకేసారి అస్వస్థతకు గురవడానికి కారణాలేమిటో వైద్యులు, అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మూడు రోజులుగా తాగునీరు రంగుమారి వస్తోందని, వాటిని తాగడం వల్లే ఇలా జరిగిందని బాధితులు చెబుతున్నారు. అస్వస్థతకు నీటి కాలుష్యమే కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు వైద్యవర్గాలు కూడా చెబుతున్నాయి. బాధితుల నుంచి రక్త, ఇతర నమూనాలు సేకరించి విజయవాడలోని సిద్దార్థ వైద్య కళాశాలకు తీసుకొచ్చారు. వీటిని పరీక్షించాక అస్వస్థతకు కారణాలేమిటో స్పష్టత వస్తుంది. ఏలూరు ఆసుపత్రిలో చేరిన బాధితులకు కొవిడ్‌ పరీక్షలు కూడా చేయాలనుకుంటున్నామని వైద్యుడు ఒకరు తెలిపారు. బాధిత కుటుంబాల్లో పేదలు, మధ్య తరగతివారే ఎక్కువ. పలు కుటుంబాలు పందుల పెంపకంతో జీవనోపాధి పొందుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఇవీ చదవండి

రాజకీయ దుర్దేశంతో దుష్ప్రచారం చేయకండి: హెరిటేజ్ పుడ్స్

Last Updated : Dec 6, 2020, 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details