ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలీసుల ఎదుట లొంగిపోయిన.. ఏలూరు వైకాపా నేత హత్యకేసు నిందితుడు - Ganji Prasad murder case

పోలీసులకు లొంగిపోయిన బజారయ్య...
పోలీసులకు లొంగిపోయిన బజారయ్య...

By

Published : May 1, 2022, 5:07 PM IST

Updated : May 1, 2022, 8:36 PM IST

17:05 May 01

పోలీసులకు లొంగిపోయిన బజారయ్య..

Ganji Prasad murder case: ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన వైకాపా నేత గంజి ప్రసాద్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బజారయ్య లొంగిపోయారు. బజారయ్యను ద్వారకాతిరుమల పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో గంజి ప్రసాద్ హత్య జరిగింది. ఈ హత్య కేసులో 10 మంది నిందితులపై కేసు నమోదైంది.

ఏం జరిగిందంటే?
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైకాపా నాయకుడు గంజి ప్రసాద్‌ శనివారం హత్యకు గురయ్యారు. గ్రామంలోని వైకాపాలో రెండు వర్గాలు ఉన్నాయని.. అందులో ఓ వర్గానికి ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడం వల్లే.. గంజి ప్రసాద్‌ హత్య జరిగిందని మరో వర్గం ఆరోపిస్తోంది. హత్యకు గురైన వైకాపా నాయకుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు గోపాలపురం వైకాపా ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వెళ్లగా.. ప్రత్యర్థి వర్గం వైకాపా కార్యకర్తలు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. కొందరు ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడి కూడా చేశారు. వెంటనే పోలీసులు ఎమ్మెల్యేకు రక్షణగా నిలబడి.. పక్కకు తీసుకెళ్లారు. అయినా.. కొందరు వైకాపా నేతలు, కార్యకర్తలు వెంటపడి మరీ.. ఎమ్మెల్యేపై దాడికి యత్నించారు.

బాధిత కుటుంబానికి హోంమంత్రి పరామర్శ..
హత్యకు గురైన వైకాపా గ్రామ కమిటీ అధ్యక్షుడు గంజి ప్రసాద్ కుటుంబాన్ని హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై జరిగిన దాడి నేపథ్యంలో అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ పోలీసు బందోబస్తుతో మాజీ మంత్రి ఆళ్ల నాని, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ తో కలిసి గంజి ప్రసాద్ ఇంటికి హోంమంత్రి చేరుకున్నారు. గంజి ప్రసాద్ భార్య సత్యవతిని ఓదార్చారు. గ్రామస్తులంతా ఏ పని ఉన్న తన భర్త దగ్గరికి వస్తారని, తన వద్దకు ఎవరూ రావడం లేదన్న కోపంతో.. బిరుదుగడ్డ బజారయ్య అనే వ్యక్తి కక్షగట్టి తన భర్తను హత్య చేయించారని సత్యవతి ఆరోపించారు. బజారయ్య వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె రోదిస్తూ హోంమంత్రికి విన్నవించారు.

హోంమంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం తరపున, పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తప్పకుండా హత్యకు కారకులైన వారిపై శిక్ష పడేలా చేసి న్యాయం చేస్తామని చెప్పారు. గంజి ప్రసాద్ హత్య చాలా దురదృష్టకరమన్న హోంమంత్రి.. ఈ ఘటనతో నాయకులు, కార్యకర్తలు చాలా వ్యధనకు గురయ్యారని చెప్పారు. గతంలో తెదేపా నుంచి వైకాపాలోకి వచ్చి కార్యకర్తలను, నాయకులను కలుపుకుంటూ పార్టీ కోసం ప్రసాద్ ఎంతో సేవ చేశారని గుర్తు చేసుకున్నారు. గంజి ప్రసాద్ దూరం అవడం అనేది పార్టీకి తీరని నష్టం అని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య చేసిన ముగ్గురు నిందితులు ఇప్పటికే పోలీసులకు లొంగిపోయారని పేర్కొన్నారు. ఎంపీటీసీ బజారయ్య పై విచారణ జరిపిస్తామన్నారు. హత్య చేసిన వారితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపైనా పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని అన్నారు.

ఇదీ చదవండి :ఈ మూడేళ్లలో ఒక్క పోలీసు నియామకమైనా జరిగిందా?: వర్ల

Last Updated : May 1, 2022, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details