ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ఆస్పత్రుల పాలవుతున్న రోగుల సంఖ్య ఇంకా పెరుగుతున్నా.. బాధితుల కోసం తగిన వసతులను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించేందుకు జనసేన పార్టీ తరఫున డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ నేతృత్వంలో డాక్టర్ బొడ్డేపల్లి రఘు, డాక్టర్ ఎమ్.వెంకటరమణతో కూడిన బృందాన్ని అక్కడికి పంపించామన్నారు. వివిధ ప్రాంతాలలో పర్యటించిన ముగ్గురు డాక్టర్ల బృందం నివేదికను తనకు అందజేసిందని పవన్ తెలిపారు.
500 పడకల ఆసుపత్రిలో న్యూరోఫిజీషియన్ లేరు
చిన్న పిల్లలకు ఐసియూ లేకపోవడం, ఈ అంతుచిక్కని వ్యాధి రోగులకు ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయకుండా సాధారణ రోగుల వార్డుల్లోనే చికిత్సలు అందించడం, ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని 500 పడకల ఆస్పత్రిలో న్యూరోఫిజీషియన్ లేకపోవడం వంటి విషయాలు ఆవేదన కలిగిస్తున్నాయని పవన్ అన్నారు. బాధితులు మూర్ఛతో బాధపడుతుంటే చికిత్స అందించవలసింది న్యూరోఫిజీషియన్ అయినప్పుడు విజయవాడ నుంచి వైద్యులను ఎందుకు రప్పించలేదని ప్రశ్నించారు. ఈ వ్యాధికి కలుషిత నీరు ఒక కారణంగా భావిస్తున్న తరుణంలో బాధిత ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా మంచినీరును ఎందుకు సరఫరా చేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.
80శాతం మందిలో నీరసం, తలనొప్పి
ముఖ్యమంత్రి ఏలూరు వెళ్లిన తర్వాత కూడా అదనపు సదుపాయాలు ఏర్పాటు కాలేదని... సాధారణ పరిస్థితులు నెలకొనే విధంగా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్ కోరారు. తమ బృందం పరిశీలన ప్రకారం... వ్యాధి బారిన పడిన బాధితుల్లో ఒక్కసారి మాత్రమే మూర్ఛ వస్తోందని... కొంతమందిలో మతిమరుపు, వాంతులు, విరోచనాలు కనిపిస్తున్నాయని... ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన కూడా 80 శాతం మందిలో నీరసం, తలనొప్పి, వెన్నునొప్పి వంటి లక్షణాలు ఉన్నాయన్నారు. ప్రత్యేకించి ఫలానా వయసువారికి మాత్రమే అస్వస్థత వస్తుందనేది లేదని.. అన్ని వయసుల వారు అస్వస్థతకు గురవుతున్నారన్నారు.
వైరస్, బ్యాక్టీరియా ఆనవాళ్లు లేవు!
వ్యాధి తీవ్రత తక్కువగానే ఉందని... వ్యాధి బారిన పడినవారు ఒకటి, రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతుండడం... ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడకపోవడం సంతోషించాల్సిన అంశాలని పవన్ అన్నారు. ఏలూరులో మున్సిపల్ వాటర్ పంపిణీ లేని ప్రాంతాలైన దెందులూరు, నారాయణపురం, కొవ్వలి, కృష్ణా జిల్లాలోని నూజివీడు, కైకలూరులో కూడా ఫిట్స్ కేసులు నమోదవ్వడం ఆందోళనకు గురి చేస్తోందన్నారు. వ్యాధి బారిన పడ్డ వారిలో సీటీ స్కాన్, రక్త నమూనాలు పరీక్షించగా అవి సాధారణంగానే ఉన్నాయన్నారు. తాగునీటి శాంపిళ్లు పరీక్షించగా అందులో పరిమితికి మించి లెడ్, నికెల్ వంటి లోహాలు లేవని అధికారులు ఇప్పటికే ప్రకటించారన్నారు. అలాగే వెన్నెముక నుంచి తీసిన నమూనాల ద్వారా చేసిన కల్చర్ పరీక్షల్లో వైరస్, బ్యాక్టీరియా ఆనవాళ్లు బయటపడలేదన్నారు.