అభయారణ్యం ఆక్రమణ.. చేపల చెరువులు తవ్విస్తోన్న ప్రజాప్రతినిధి..! నిబంధనలకు విరుద్ధంగా పదులకొద్దీ భారీ యంత్రాలు కొల్లేరు అభయారణ్యంలో ఉంచడం చట్టరీత్యా నేరం. యంత్రాలను కొల్లేరులోకి తీసుకెళ్లాలంటే.. అనుమతులు తప్పనిసరి. అలాంటిది పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం వీరమ్మకుంట గ్రామ సమీపంలోని కొల్లేరు సరస్సులో పదుల కొద్దీ తవ్వకపు యంత్రాలు ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా కొల్లేరుకు తరలించారు. కొల్లేరు అభయరణ్యంలో తవ్వేయంత్రాలు కనిపిస్తే.. సీజ్ చేసే అధికారం అధికారులకు ఉంది. అలాంటిది యంత్రాలు కొల్లేరులో కనిపిస్తున్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
దెందులూరు ప్రజాప్రతినిధి హస్తం
తెలివిమీరిన అక్రమార్కులు.. యంత్రాలతో రాత్రుళ్లు పనిచేస్తున్నారు... పగలు ఖాళీగా పెడుతున్నారు. వీరికి అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం వీరమ్మకుంట గ్రామ సమీపంలో సుమారు ఐదు వందల ఎకరాల కొల్లేరు అభయరణ్యాన్ని ఆక్రమించి.. చేపల చెరువులుగా మారుస్తున్నారు. దెందులూరు నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఇందులో ప్రత్యక్ష పాత్ర పోషిస్తున్నట్లు వీరమ్మకుంట గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
కన్నెత్తి చూడని అధికారులు
ప్రజాప్రతినిధి రంగంలో ఉండటంతో రెవెన్యూ, అటవీశాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొల్లేరులో చేపల చెరువులు తవ్వడాన్ని గ్రామస్థులు అడ్డుకొన్నా.. వారిని సైతం బెదిరిస్తున్నారు. సుమారు 20 ప్రొక్లెయిన్లతో చేపల చెరువులు తవ్వుతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. అధికారులు మాత్రం మొక్కుబడిగా కేసులు నమోదు చేసి.. చేతులు దులుపుకుంటున్నారు. అయినా చెరువులు తవ్వకం ఆగలేదని స్థానికులు అంటున్నారు.
చేపల చెరువులు తవ్వడం నిషేధం
వీరమ్మకుంట గ్రామసమీపంలో కొల్లేరును ప్రభుత్వం అభయారణ్యంగా గుర్తించింది. గతంలో ఇక్కడ ఉన్న చేపల చెరువులు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో ధ్వంసం చేశారు. 2006లో ఐదు కాంటూరు పరిధిలోని చేపల చెరువులను అధికారులు ధ్వంసం చేశారు. పక్షుల ఆవాసం కల్పించడం, కొల్లేరును పరిరక్షించడం కోసం ఐదో కాంటూరు వరకు అభయరణ్యంగా ప్రకటించారు. ఇందులో ఎలాంటి చేపల చెరువులు తవ్వడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నాయి. తవ్వే యంత్రాలు అభయరణ్యంలోకి ప్రవేశిస్తే.. నిబంధనల మేరకు సీజ్ చేసి.. కేసు నమోదు చేయాలి. పాలనా పగ్గాలు మారాక ప్రజాప్రతినిధుల అండతో కొందరు ఐదో కాంటూరు లోపలికి వెళ్లి.. చేపల చెరువుల తవ్వకాలు మొదలయ్యాయి.
గ్రామస్థుల ఆవేదన
వీరమ్మకుంట గ్రామ పరిధిలో ఇప్పటికే భారీగా కొల్లేరును ఆక్రమించారు. గ్రామస్థులు ఫిర్యాదుతో అధికారులు మొక్కుబడిగా కేసు నమోదు చేసి.. చేతులు దులుపుకున్నారు. యంత్రాలను మాత్రం సీజ్ చేయలేదు. అధికారపార్టీకి చెందిన నాయకులు చెరువులు తవ్వుతున్నారని కొల్లేరువాసులు అంటున్నారు. 2006లో చేపల చెరువులు ధ్వంసం చేశాక.. గ్రామస్థులు గొర్రెలు, పశువులను కొల్లేరులో మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం చేపల చెరువులు తవ్వుతుండటం వల్ల.. ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. కొల్లేరు పర్యావరణం దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. కొల్లేరులో డ్రైన్ తవ్వడం కోసం యంత్రాలు తీసుకెళ్లారని అటవీశాఖ రేంజ్ అధికారి కృష్ణ కుమార్ అంటున్నారు.
ఆక్రమణలకు గురికాకుండా ఐదో కాంటూరు పరిధిలోని కొల్లేరు అభయరణ్యాన్ని అటవీ, రెవెన్యూ అధికారులు పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి :భూముల స్వాధీనంపై అధికారిక సమాచారం లేదు: అమరరాజా