పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధిని నిర్ధరణ చేయడానికి మరో ఐదు రోజుల సమయం పడుతుందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. నగరంలో వింత వ్యాధి బారినపడిన బాధిత కుటుంబాలను మంత్రి శనివారం పరామర్శించారు. వారితో మాట్లాడి.. సమస్యలు తెలుసుకున్నారు. ఆయా వీధుల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం పరిస్థితులు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రస్తుతం ఏలూరులో సాధారణ పరిస్థితి నెలకొందని అన్నారు.
వ్యాధి కారణాలపై జాతీయ సంస్థలు పరిశోధన సాగిస్తున్నాయి. ఆ సంస్థలు బుధవారం తుది నివేదికలు అందజేసే అవకాశం ఉంది. ఆ తరువాతే వ్యాధికి కారణాలు వెల్లడిస్తాం. ఏలూరులోని తాగునీటిలో ఎలాంటి కాలుష్యం లేదని ప్రాథమికంగా నిర్ధరణ అయింది. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు- ఆళ్ల నాని, వైద్యారోగ్యశాఖ మంత్రి