పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మంగళవారం నుంచి వారం రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం(స్పెషల్ శానిటేషన్ డ్రైవ్) చేపట్టనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. స్థానికులు కూడా తమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు ప్రజల అస్వస్థతకు కారణాలేంటో ఇంకా నిర్ధరణ కాలేదని మంత్రి వెల్లడించారు. సీసీఎంబీ, ఎయిమ్స్ నివేదికలు రావాల్సి ఉందన్నారు. అవి వచ్చాక ఘటనకు గల కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)కు చెందిన బృందం మంగళవారం ఏలూరులో పర్యటిస్తుందని మంత్రి వెల్లడించారు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు ఔషధాలు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని ఆళ్ల నాని చెప్పారు. 30 ఆంబులెన్స్‌లను సిద్ధం చేశామని వెల్లడించారు.