అంతు చిక్కని సమస్యతో.. ఏలూరు ప్రభుత్వాస్వత్రిలో చేరుతున్న రోగులందరికీ అన్ని వైరల్ టెస్టులూ చేయించినట్లు.. వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. అన్ని టెస్టులు నెగిటివ్గా వచ్చాయన్నారు. బ్యాక్టీరియా, ఫంగల్ టెస్టులూ నెగిటివ్ వచ్చాయని స్పష్టం చేశారు. తాగునీటికి సంబంధించిన నమూనా టెస్టులు, అలాగే నీటిలో భారలోహాలకు సంబంధించిన అంశాలపైనా పరిశీలన చేశామన్నారు. ఇక కల్చర్ టెస్టులు మాత్రమే రావాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రానికి ఆ ఫలితాలూ వస్తాయని కాటమనేని భాస్కర్ తెలిపారు.
రక్త నమూనాలతో పాటు వెన్నుపూస నుంచి తీసిన శాంపిళ్లను పరీక్షించినా ఏమీ వెల్లడి కాలేదని కాటమనేని భాస్కర్ తెలిపారు. అయితే మరింత లోతైన అధ్యయనం కోసం సీసీఎంబీ కణజాల పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పూణేలోని వైరాలజీ ల్యాబ్, ఎన్సీడీసీ నుంచి కూడా బృందాలు రానున్నాయని వెల్లడించారు.