ఏలూరు నగర ప్రజలను వరుస గండాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొన్న కొవిడ్ కల్లోలం సృష్టించింది. నిన్న వరద అతలాకుతలం చేసింది. ప్రస్తుతం అంతుచిక్కని వ్యాధి బారిన పడ్డారు. కరోనా తాకిడికి, వరదల ఉద్ధృతికి కొంత నష్టం జరిగినా.. జాగ్రత్తలు పాటించి బయటపడ్డారు. ఇది మాత్రం ఆరోగ్యవంతులనూ ఆసుపత్రుల పాల్జేస్తోంది.
కరోనా కలకలం.. జిల్లావ్యాప్తంగా కరోనా విస్తరించినా మొదటి నుంచీ ఏలూరులో కేసులు పెరిగిన తీరు నగర ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. జులై, ఆగస్ట్టు, సెప్టెంబరు నెలల్లో జిల్లాలో ఒక్కోరోజు వెయ్యి వరకు కేసులు నమోదైతే అందులో 750 వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో నమోదైనవే.
అంతుచిక్కక.. దిక్కుతోచక.. ప్రస్తుతం అంతుచిక్కని వ్యాధి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కోలుకుని ఇంటికి వెళ్లిన వారిని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.
నలుగురితో మొదలై.. ఈ నెల 4న సాయంత్రం మూర్ఛ లక్షణాలతో నోటి నుంచి నురగలు కక్కుతూ ఏలూరు దక్షిణపువీధికి చెందిన నలుగురు బాధితులు ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. వైద్యులు వారిని పరీక్షించి వైద్యసేవలు అందించారు. అప్పటి వరకు ఎవరికీ తెలియదు ఈ అంతుచిక్కని వ్యాధి గురించి. సాధారణంగానే అనారోగ్యానికి గురయ్యారని అంతా భావించారు.
ఐదో తేదీ నుంచి ఉద్ధృతి
కేసుల ఉద్ధృతి ఐదో తేదీ నుంచి పెరిగింది. అప్పటికి పరిస్థితి కొంత అర్థమైంది. ఏదో తెలియని వ్యాధి చుట్టుముట్టిందని..ఆపద ముంచుకొస్తుందని భావించారు. ఒకరి తర్వాత ఒకరుగా 5వ తేదీ సాయంత్రానికి 79 మంది బాధితులు ఆసుపత్రిలో చేరారు.
వరద ముంపు.. అక్టోబరులో వచ్చిన తమ్మిలేరు వరదలకు 22 వేల క్యూసెక్కుల నీరొచ్చింది. మూడుచోట్ల గండ్లు కొట్టి నీటి ప్రవాహాన్ని మళ్లించారు. నగరంలో 15 ప్రాంతాలు రెండు రోజుల పాటు ముంపులో ఉన్నాయి. వరద ఉద్ధృతికి నగరం మునిగిపోతుందనే భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు.
నగరాన్ని చుట్టేసిందిలా..!
- అంతుచిక్కని వ్యాధి నగరాన్ని చుట్టేసిన క్రమాన్ని పరిశీలిస్తే.. ఎంతటి విపత్తుకు దారి తీస్తుందోనని అంతా ఆందోళన చెందారు. ప్రాంతాల వారీగా విస్తరించిన తీరిలా..
- 5న దక్షిణపు వీధితో పాటు పడమరవీధి, కొత్తపేట, తాపీమేస్త్రికాలనీ, అశోక్‌నగర్, ఆదివారపుపేట, తంగెళ్లమూడి, కొబ్బరితోట, శనివారపుపేట అరుంధతీపేట వాసులు ఆసుపత్రిలో చేరారు.
- 6న బాధితుల్లో తాపీమేస్త్రీ కాలనీ, పడమరవీధి, కొత్తపేట, శనివారపుపేట, అరుంధతీపేట, ఎస్‌ఎంఆర్ నగర్‌వాసులున్నారు.
- 7న కొత్త ప్రాంతాలైన దెందులూరు మండలం గాలాయ గూడెం, నగరంలోని చోడిదిబ్బ, వంగాయగూడెం, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది.
- 8న కేసుల తాకిడి తగ్గింది. శాంతినగర్, పెన్షన్‌లైన్, ఆర్‌ఆర్ పేట, పవరుపేట, విద్యానగర్ తోపాటు పాత ప్రాంతాల వారు ఆసుపత్రిలో చేరారు.
- 9, 10, 11, 12 తేదీల్లో పాత ప్రాంతాల నుంచే కేసులు వచ్చాయి.
కొత్త కేసులు నమోదు కాకపోవడంతో.. ఊపిరి పీల్చుకున్న ఏలూరు ప్రజలు
ఇదీ చదవండి:నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్