ఏలూరులో వింత వ్యాధితో ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. ఆ వ్యాధిని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువస్తూ.. ప్రభుత్వ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రకాల చికిత్సలకు ప్యాకేజీలను నిర్దేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్టు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడానికి మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ప్రస్తుతం ఉన్న ప్యాకేజ్ 10,000 రూపాయల నుంచి 15, 688 రూపాయల వరకు పెంచుతూ ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి ఆళ్ల నాని చెప్పారు.
మూడు నుంచి ఐదు రోజులకు
మూర్ఛ వ్యాధిగ్రస్తులకు 8 రకాల రక్త పరీక్షలను కూడా ఈ ప్యాకేజీలో కలిపినట్టు మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నెట్వర్క్ ఆసుపత్రులలో వైద్యచికిత్స పొందుతున్న వారికి ప్రస్తుత కాలపరిమితిని మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఇస్తున్న 12,000 రూపాయల నుంచి 18,908 రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని ఐదు రకాల రక్త పరీక్షలను కూడా ఈ ప్యాకేజీలో చేర్చామని ఆళ్ల నాని తెలిపారు. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న చిన్న పిల్లలకు ప్రస్తుతం ఉన్న ప్యాకేజీ 10,262 రూపాయల నుంచి 12,732 రూపాయల వరకు ప్యాకేజీ మొత్తాన్ని పెంచినట్టు వెల్లడించారు. అన్ని నెట్వర్క్ ఆసుపత్రులలో ఐదురోజులకు మించి చికిత్స పొందే మూర్ఛ వ్యాధిగ్రస్తులకు రోజుకు 900 రూపాయలు, ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యాధిగ్రస్తులకు 2000 రూపాయలు ప్యాకేజీని కొత్తగా చేర్చడం జరిగిందని తెలిపారు.
వ్యాధి తగ్గుముఖం!
మరోవైపు ప్రాథమికస్థాయిలో రోగుల రక్తంలో పరిమితికి మించి నికెల్, సీసం లాంటి భారలోహాలు ఉన్నట్టు గుర్తించినప్పటికీ .. మరింత లోతైన విశ్లేషణ కోసం దిల్లీలోని ఎయిమ్స్‌కు రక్త నమూనాల్ని ప్రభుత్వం పంపించింది. ఈ రోగం గుట్టు కనుగొనేందుకు జాతీయ స్థాయిలోని పరిశోధనా సంస్థల బృందాలు ఏలూరులోని వివిధ ప్రాంతాకు వెళ్లి నమూనాలు సేకరించటంతో పాటు స్థానికంగా ఉన్న పారిశుధ్య పరిస్థితిని కూడా అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వింత వ్యాధి క్రమేణా తగ్గుముఖం పడుతోందని ప్రభుత్వ వైద్యులు స్పష్టం చేస్తున్నారు.