జిల్లా కేంద్రం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల పునఃప్రారంభించనున్నారు. తద్వారా జిల్లా ప్రజలకు ఊరట లభించనుంది. కరోనా నేపథ్యంలో పాజిటివ్ వచ్చిన వారికి, అనుమానిత లక్షణాలున్న వారికి వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రిని కేటాయించారు. విభాగాలన్నీ ఖాళీ చేయించి కొవిడ్ ఆసుపత్రిగా మార్చారు. నెల రోజుల నుంచి సాధారణ సేవలను నిలిపివేశారు. సాధారణ, అత్యవసర వైద్య సేవలకు అవకాశం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సూచనల మేరకు కలెక్టర్ ముత్యాలరాజు ఏలూరు ప్రభుత్వాసుపత్రిని తిరిగి పూర్వస్థితికి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న కరోనా బాధితులను వారం రోజుల కిందట ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోని అన్ని విభాగాలను సూపర్ శానిటేషన్ చేసి సేవలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా డీసీహెచ్‌ఎస్ శంకరరావు మాట్లాడుతూ బుధవారం నుంచి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్, ప్రసూతి సేవలతో పాటు అత్యవసర, సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
వైద్య సేవలు పునఃప్రారంభం - ఏలూరు ఆసుపత్రిపై కథనం
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు తిరిగి ప్రారంభించారు. కొద్ది రోజులుగా కరోనా బాధితులకు ఆసుపత్రిలో సేవలందిస్తున్నారు. సాధారణ, అత్యవసర వైద్య సేవలకు అవకాశం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు... దీంతో కరోనా బాధితులను ఆశ్రం ఆసుపత్రికి తరలించారు.

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పునఃప్రారంభం