CM Jagan on Rythu Barbarossa: ‘రైతు సంక్షేమం, అభివృద్ధిలో తెదేపా ప్రభుత్వానికి.. మనందరి ప్రభుత్వానికి వ్యత్యాసం మీరే గుర్తించి, అందరికీ తెలియజెప్పాలి.. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఏడాదికి రూ.13,500 చొప్పున క్రమం తప్పకుండా 50.10 లక్షల మంది రైతులకు సాయం చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఏలూరు జిల్లా గణపవరంలో నాలుగో ఏడాది మొదటి విడత రైతు భరోసా నగదు విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగదును రైతుల ఖాతాల్లో జమ చేశారు. అంతకు ముందు సభలో మాట్లాడారు. ‘తెదేపా ప్రభుత్వం రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవు. రైతులకు ఇచ్చే వడ్డీలేని రుణాలు గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.782 కోట్లు ఇస్తే.. మనందరి ప్రభుత్వం మూడేళ్లలోనే రూ.1,282 కోట్లు ఇచ్చింది.
ఖరీఫ్ సీజన్, వ్యవసాయ పనులు మొదలు కాకుండానే మొదటి విడత రూ.7,500లో రూ.5,500 చొప్పున రూ.3,758 కోట్లను సరాసరి మీ ఖాతాల్లోకే వేస్తున్నాం. మిగిలిన రూ.2వేల సాయం కేంద్రం పీఎం కిసాన్ కింద నెలాఖరుకు జమ చేస్తుంది. అక్టోబరులో పంట కోత సమయంలో రూ.4వేలు జమ చేస్తాం. సంక్రాంతి సమయంలో మరో రూ.2వేలు ఇస్తాం. నాలుగు విడతల్లో క్రమం తప్పకుండా రైతు భరోసా కింద దాదాపు రూ.23,875 కోట్లు అందించాం. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆహారధాన్యాల ఉత్పత్తి 16 లక్షల టన్నులు పెరిగింది. సుభిక్షంగా వర్షాలు కురిసి అనంతపురం లాంటి కరవు జిల్లాలో సైతం భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి’ అని పేర్కొన్నారు.
ప్రశ్నించలేని దత్తపుత్రుడిని ఏమనాలి :‘తెదేపా పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను వదిలేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాస్‌బుక్, సీసీఆర్‌సీ కార్డు ఉన్న ప్రతి రైతుకూ రూ.7 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నాం. రైతులను ఉద్ధరిస్తానని బయల్దేరిన చంద్రబాబు దత్తపుత్రుడు.. అన్ని అర్హతలుండీ పరిహారం పొందని ఒక్క రైతునూ చూపించలేకపోయాడు. గతంలో తెదేపా మేనిఫెస్టోలో చంద్రబాబుతో పాటు దత్తపుత్రుడి ఫొటో పెట్టారు. వీళ్లందరూ చాలరన్నట్లు మోదీ చిత్రం తగిలించారు. ప్రజలను ఎందుకు మోసం చేశారని ప్రశ్నించలేని దత్తపుత్రుడిని ఏమనాలి?
రైతులకు పరిహారం ఇవ్వలేదు.. :గత ప్రభుత్వం వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు ఏళ్లు గడిచినా పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రస్తుతం పంట నష్టం జరిగిన తర్వాత ఆ పంటకాలం పూర్తయ్యేలోపే పరిహారం జమ చేస్తున్నాం. రైతుల పొలాల్లో మోటార్లు తీసుకుపోవడం, విద్యుత్తు కోతలు.. న్యాయం కోరిన రైతులపై బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపిన తెదేపా పాలనను గుర్తుచేసుకోండి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఫొటోతో మేనిఫెస్టో విడుదల చేశారు. తర్వాత దాన్ని తెదేపా వెబ్‌సైట్ నుంచి తొలగించడంతోనే వారి చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు.