రాష్ట్రంలో వాటర్ గ్రిడ్‌తో పాటు అనేక వ్యవస్థల్ని నిర్వీర్యం చేయటం వల్లే ఏలూరు వింత వ్యాధి ఘటనలు జరుగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. తెలుగుదేశంపై దాడి, అక్రమ కేసులు బనాయింపు, పెళ్లి వేడుకులకు హాజరయ్యేందుకు చూపిస్తున్న శ్రద్ధ.. ప్రజారోగ్యం పట్ల సీఎంకి లేదని మండిపడ్డారు. ఏలూరు వెళ్లిన సీఎం ప్రజలకు నమ్మకం కలిగించేలా వ్యవహరించటంలో విఫలమయ్యారని విమర్శించారు. ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గంలోనే ప్రజలకు ఇలాంటి అనుభవాలు ఎదురైతే ఇతర ప్రాంతాల పరిస్థితి ఏమిటని..? నిలదీశారు. వ్యాధికి కారణాలు తెలియవని వితండవాదం చేయటం సరికాదని హెచ్చరించారు. కరోనా సమయంలో బ్లీచింగ్ పౌడర్ స్థానంలో సున్నం చల్లిన ఘటనను ప్రస్తావించిన చంద్రబాబు... దానిపై వేసిన విజిలెన్స్ విచారణ నివేదిక ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు.
చిత్తశుద్ధితో వ్యవహరించండి...
ముఖ్యమంత్రికి అప్పులు చేయటం, ఆస్తులు అమ్మటం, పన్నులు వసూలు చేయటంపై ఉన్న ధ్యాస ప్రజా సమస్యలపై లేదని చంద్రబాబు మండిపడ్డారు. గత కొంతకాలంగా ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య సిబ్బందికి నిధులు చెల్లించకపోవటం కూడా ఏలూరు వింత వ్యాధి ఘటనకు ఓ కారణమని చంద్రబాబు ఆరోపించారు. ఏలూరులో పరిస్థితి దారుణంగా ఉంటే ఎందుకు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించలేదని నిలదీశారు. ఇకనైనా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రజారోగ్యం కాపాడేందుకు చిత్తశుద్ధితో వ్యవహరించాలని హితవు పలికారు. వ్యవస్థలు సక్రమంగా అమలైతే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని స్పష్టం చేశారు.