తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల వేలాన్ని వ్యతిరేకిస్తూ.. పశ్చిమ గోదావరి జిల్లాలో భాజపా శ్రేణులు ఉపవాస దీక్ష చేపట్టాయి. ఏలూరు పార్టీ కార్యాలయంలో భాజపా నేతలు ఉపవాస దీక్ష చేపట్టారు. వెంకటేశ్వరుని చిత్రపటాన్ని ఉంచి.. ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. తితిదే ఆస్తుల విక్రయాన్ని నిలుపుదల చేయాలని, రాష్ట్రంలో దేవాలయ ఆస్తులను పరిరక్షించాలని నినాదాలు చేశారు.
సింహాచలం అప్పన్న భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తోందని నేతలు ఆరోపించారు. ఆలయ అభివృద్ధి పేరుతో ఆస్తుల అమ్మకానికి పెట్టడం సమంజసం కాదని భాజపా నాయకులు అన్నారు. ఈ నిర్ణయాన్ని సత్వరమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.