ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దాలని అధికారులను ఆదేశిస్తూ అక్కడ ఎన్నికలను హైకోర్టు నిలిపివేసింది. ఎన్నికలను వాయిదా వేయొచ్చు లేదా తిరిగి ప్రారంభించవచ్చు కానీ....కోర్టు ఆదేశాలు, న్యాయపాలన అమలును వాయిదా వేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.
నిజమైన స్ఫూర్తితో అమలు..
న్యాయస్థాన ఆదేశాల్ని నిజమైన స్ఫూర్తితో అమలు చేయాలని పేర్కొంది. ఏలూరు ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికారులు నిబంధనలు పాటించలేదని తీవ్ర తప్పులు జరిగాయని, అభ్యంతరాలు స్వీకరించకుండానే తుది జాబితా తయారీకి అధికారులు సిద్ధమయ్యారంటూ గతేడాది హైకోర్టులో కొందరు వ్యాజ్యం దాఖలు చేశారు. అప్పుడు విచారణ జరిపిన హైకోర్టు.. కుక్క ఫొటోతో ఓటరు గుర్తింపు కార్డు ప్రచురించడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఒకే వ్యక్తికి వేర్వేరు ఇంటి నంబర్లతో ఓటు హక్కు కల్పించడంపై అధికారుల్ని ప్రశ్నించింది.
జాబితాలో తప్పులను సరిదిద్దాకే ఎన్నికలు నిర్వహించాలని గతేడాది మార్చి 5న తీర్పు ఇచ్చింది . ఆ తీర్పు మేరకు అధికారులు వ్యవహరించలేదని... తప్పులు సరిదిద్దకుండానే ఎన్నికలు నిర్వహించబోతున్నారంటూ పిటిషనర్లు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వులను అధికారులు విస్మరించారన్నారు. ఇంటి నంబర్లు లేకుండా చాలా మందికి వివిధ డివిజన్లలో ఓట్లు కల్పించారన్నారు . చాలా మంది ఓటర్ల ఇంటి నంబర్లను నాలుగు సున్నాలుగా చూపారన్నారు.
తప్పులు సరిదిద్దడానికి..
కోర్టు ఆదేశాల తర్వాత తప్పులు సరిదిద్దడానికి వెంటనే చర్యలు చేపట్టామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఓటర్ల జాబితాకు సంబంధించి ప్రభుత్వం సమర్పించిన సీడీని పరిశీలిస్తే తప్పులు ఇప్పటికీ ఉన్నాయని ధర్మాసనం ఆక్షేపించింది. వార్డు నంబర్1 లో ఇంటి నంబరును నాలుగు సున్నాలుగా పేర్కొంటూ ఆరుగురికి ఓట్లున్నాయని ఉదహరించింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని ఎన్నికల సంఘం.. కలెక్టర్‌ను గతేడాది మార్చి 9 న కోరిందని ఆదేశాలు అమలు చేసినట్టు అదే రోజున ఏలూరు మున్సిపల్ కమిషనర్ ఎస్ఈసీకి సమాచారం ఇచ్చారని ధర్మాసనం పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని.. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలకు 15 రోజుల గడువు ఇవ్వలేదని వ్యాఖ్యానించింది. చట్టబద్ధ నిబంధనలను మరోసారి ఉల్లంఘించారని పేర్కొంది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించలేమని..... ఎన్నికల వాయిదా వల్ల కలిగే అసౌకర్యం కన్నా కోర్టు ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా సవరణ వల్ల కలిగే ప్రజాప్రయోజనమే ఎక్కువ అని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలను నిలిపివేస్తున్నట్టు తీర్పునిచ్చింది. కౌంటర్ వేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ వ్యాజ్యంపై విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి
రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సాయం చేయలేం: కేంద్రం