అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళల నిరసనోద్యమం మళ్లీ ఊపందుకుంది. కొవిడ్ కారణంగా కొన్నాళ్లు ఇళ్లలోనే నిరసన చేపట్టిన రైతులు.. బహిరంగంగా శిబిరాల్లోనే తమ గళాన్ని వినిపిస్తున్నారు. ధర్నా శిబిరాలను మళ్లీ పునరుద్ధరించారు. మూడు రాజధానుల ఏర్పాటుకు ఆమోదంతోపాటు సీఆర్డీఏ చట్టాన్ని గవర్నర్ రద్దు చేయడంతో రాజధాని గ్రామాల్లో మళ్లీ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. భూములిచ్చిన రైతుల భవిష్యత్తు ఏంటో చెప్పకుండా... 230 రోజులుగా నిరసనలు చేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించిందంటూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు మండిపడుతున్నారు.
పోరాటం సాగిస్తాం
తుళ్లూరు, మందడం, వెలగపూడి, పెదపరిమి ప్రాంతాల్లో రైతులు.... నిరసన దీక్షలకు మళ్లీ శ్రీకారం చుట్టారు రైతులు. జై అమరావతి... జై ఆంధ్రప్రదేశ్ నినాదాలతో ధర్నా శిబిరాలు హోరెత్తాయి. వ్యక్తిగత, పార్టీ కక్షలు దృష్టిలో ఉంచుకుని రాష్ట్రప్రభుత్వం రైతుల పొట్ట కొడుతుందంటూ రైతులు నినాదాలు చేశారు. అదే సమయంలో కేంద్రం కావాలనే ప్రేక్షకపాత్ర పోషిస్తుందని దుయ్యబట్టారు. తమ జీవితాలతో ముడిపడి ఉన్న రాజధాని సమస్య పరిష్కారమయ్యేదాకా క్షేత్రస్థాయిలో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని.. న్యాయపోరాటం చేస్తామని రైతులు స్పష్టం చేశారు. న్యాయదేవతే తమను కాపాడాలంటూ తుళ్లూరులో రైతులు, మహిళలు హైకోర్టు చిత్రపటానికి పూజలు నిర్వహించారు.
రాయలసీమకు ఒరిగిందేంటి..?
గవర్నర్ మూడు రాజధానుల నిర్ణయానికి ఆమోదం తెలపడంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్సీ బీటెక్ రవి..... తుళ్లూరు, వెలగపూడి, మందడం గ్రామాల్లో రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం చెబుతున్నట్లు అధికార వికేంద్రీకరణ కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనన్న బీటెక్ రవి... జ్యుడీషియల్ రాజధానితో రాయలసీమకు ఒరిగేదేమిటని ప్రశ్నించారు. ప్రశాంతమైన విశాఖపట్నాన్ని కలుషితం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. మూడు రాజధానులతో నష్టమే తప్ప లాభం లేదని... తమ ప్రాంతాలపై ప్రేమ ఉంటే గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని బీటెక్ రవి కోరారు. మూడు రాజధానులతో పేద రైతులు, కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని తుళ్లూరులో దళిత ఐకాస ఆందోళన వ్యక్తం చేసింది. అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన ఎస్సీ కూలీలు... ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలంటూ వేడుకున్నారు.