ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Porus Pollution: 'పోరస్‌' కాలుష్యం.. 55 ఏళ్లకే ప్రాణాలు పోతున్నాయి - ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం వాసుల ఆందోళనలు

Forus Incident: ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగి ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే! అయితే ఆ గ్రామంలోని బోర్ల నుంచి వస్తున్న నీటిని కుంటలో నిల్వ చేస్తే దాని అడుగు భాగంలోని మట్టి నల్లటి ముద్దలుగా మారిపోతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగే నీటిలో ప్రమాదకర రసాయనాలు కలవడం వల్ల మా ఊళ్లో 55 ఏళ్లకు మించి ఎవరూ బతకట్లేదని వాపోతున్నారు.

akkireddygudem peoples worried about their lives
"పోరస్‌".. మా ప్రాణాల్ని మింగేస్తోంది

By

Published : Apr 15, 2022, 8:23 AM IST

Forus Incident: పోరస్‌ పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యం వల్ల భూగర్భ జలమంతా కలుషితమైపోయిందని, బోర్ల నుంచి వస్తున్న నీటిలో ప్రమాదకర రసాయనాలు కలగలిసి ఇలా నల్లటిముద్దగా అడుగున చేరుతోందని అక్కిరెడ్డిగూడెం వాసులు వాపోతున్నారు. ‘‘పోరస్‌ కర్మాగారం మా ప్రాణాల్ని తోడేస్తోంది. దాని కాలుష్యంతో మా ఊళ్లో 55 ఏళ్లకు మించి ఎవరూ బతకట్లేదు. ఆరేళ్ల పిల్లల నుంచే గ్యాస్ట్రిక్‌ సమస్యలు వస్తున్నాయి. కిడ్నీ బాధితులు ఏటా పెరిగిపోతున్నారు. నాలుగైదేళ్ల కింద వరకూ మా ఊళ్లో డయాలసిస్‌ చేయించుకునేవారెవరూ లేరు. ఇప్పుడు వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి. పిల్లల్లో ఎదుగుదల ఉండట్లేదు. కాలుష్యంతో ఇలా నిత్యం నరకం చూపించే బదులు.. ఊరందర్ని ఒకేసారి చంపేయండి’’ అంటూ అక్కిరెడ్డిగూడెం వాసులు ఆవేదన చెందుతున్నారు .

అత్యంత ప్రమాదకర రసాయనాలతో కూడిన వ్యర్థజలాలన్నింటినీ భూగర్భంలోకి పంపిస్తూ కర్మాగార యాజమాన్యం తమ ప్రాణాలతో చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. ఎవర్ని కదిపినా.. ‘‘కాలుష్యం, భద్రతాలేమితో ప్రాణాలు తీసే ఈ కర్మాగారం మాకొద్దు. వెంటనే దాన్ని మూసేయాలి.’’ అనే మాటే అందరి నోటా వినిపిస్తోంది. ఈ పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థ జలాల్ని రెండు, మూడేళ్ల కిందటి వరకూ స్థానికంగా ఉండే రంగం చెరువులోకి విడిచిపెట్టేవారంటా.. రెండేళ్ల కిందట ఒకరోజున ఆ నీళ్లు తాగిన పలు మేకలు, గేదెలు మృతిచెందాయని తెలిపారు. అప్పట్లో గ్రామస్థులు ఆందోళన చేయటంతో వ్యర్థజలాల్ని చెరువులోకి పంపటం ఆపేశారని, ప్రస్తుతం వాటిని భూగర్భంలోకి పంపిస్తున్నారని స్థానికుడైన బర్మా రవీంద్ర ఆరోపించారు.

ఫిర్యాదు చేసినా.. తనిఖీలే తప్ప చర్యలు లేవు:గ్రామానికి చెందిన రూపేష్‌ తల్లి.. కొన్నాళ్ల కిందట కిడ్నీ వ్యాధి బారిన పడి డయాలిసిస్‌ చేయించుకునే స్థితికి వెళ్లి చివరకు చనిపోయారు. తన తల్లి అనారోగ్యానికి కారణం పరిశ్రమ కాలుష్యమేనని నిర్ధారించుకున్న రూపేష్‌... అలాంటి పరిస్థితి ఇంకెవరికీ రాకూడదనే ఉద్దేశంతో పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంపై.. 2016, 2017లలో కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. అప్పట్లో వారు తనిఖీలు జరిపి పలు చర్యలు చేపట్టాలని కర్మాగారానికి సూచించారు. ఆ తర్వాత నుంచి అవి అమలయ్యాయా? లేదా? అనేది పట్టించుకునేవారే లేరు. గ్రామంలో కిడ్నీ వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య మరింతగా పెరిగింది. ఎవరైనా ఫిర్యాదు చేసినా విచారణ జరిగేటప్పుడు కర్మాగారం యాజమాన్యం గ్రామంలోని కొందరితో కుమ్మక్కయి వారికి అనుకూలంగా, అంతా సవ్యంగా ఉందని చెప్పించుకుంటోందని పలువురు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళలో కర్మాగారం నుంచి వెలువడే పొగ దట్టంగా, నల్లగా గ్రామం మొత్తాన్ని కమ్మేస్తోందని శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు.

ప్రాణాలకు ముప్పు..:మా ఊరిలో ఎవరూ 55 ఏళ్లకు మించి బతకట్లేదు. పోరస్‌ కాలుష్యమే దీనికి కారణం. ఇక్కడి నీళ్లు, గాలి, నేలలో ప్రమాదకర రసాయనాలు కలిసిపోతున్నాయి. వాటి వల్ల అనారోగ్యం బారిన పడుతున్నాం. ప్రాణాలు కోల్పోతున్నాం. కర్మాగారం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్లాంటు నీరు తాగితే మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి. -కవల అర్జునరావు, అక్కిరెడ్డిగూడెం

గంటన్నర పాటు నీళ్లు వదిలేయాల్సిందే.. :మా ఊరిలో అందరికీ తాగేందుకు బోరు నీరే దిక్కు. మొదట్లో దాదాపు గంటన్నర పాటు నీరంతా నల్లగా వస్తుంది. అవి తాగటానికి పనికిరావట్లేదు. ఆ తర్వాత నీళ్లు పట్టుకుంటేనే వాటిని తాగగలం. అవి తాగితే అనేక రోగాలు వచ్చి ప్రాణాలు పోతాయని తెలిసినా సరే.. వేరే గత్యంతరం లేక తాగుతున్నాం. -ఎం.మోహన్‌రావు

డయాలిసిస్‌ రోగులు పెరుగుతున్నారు:కర్మాగారం కాలుష్యం ఫలితంగా మా గ్రామంలో కిడ్నీ బాధితుల సంఖ్య ఏటా పెరుగుతోంది. గతంలో ఈ పరిస్థితి లేదు. 2017 నాటికి మా గ్రామంలో డయాలసిస్‌ దశకు చేరిన కిడ్నీ రోగులు ఒక్కరూ లేరు. ఇప్పుడు వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. -బర్మా రూపేష్, అక్కిరెడ్డిగూడెం

ఇదీ చదవండి: నేడే ఒంటిమిట్టలో సీతారాములు కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం

ABOUT THE AUTHOR

...view details