రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో చాలా చోట్ల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఆయా జిల్లాల రిటర్నింగ్ అధికారులు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను వెల్లడించారు.
పులివెందులలో వైకాపా ఏకగ్రీవం
పులివెందులు అన్ని స్థానాలు ఏకగ్రీవం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో మొత్తం 65 ఎంపీటీసీ, 7 జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. అన్ని స్థానాల్లోనూ వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో అన్ని స్థానాలు ఏకగ్రీవం కావడం చరిత్రలో తొలిసారని అభ్యర్థులు తెలిపారు. తమకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఎంపీటీసీ అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ రెడ్డి, ఏఎస్ఎఫ్ఐ దినేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రొద్దుటూరులో
ప్రొద్దుటూరులో 15 ఎంపీటీసీలు ఏకగ్రీవం కడప జిల్లా ప్రొద్దుటూరులో 24 ఎంపీటీసీ స్థానాల్లో 15 ఏకగ్రీవం అయ్యాయి. 14 స్థానాల్లో వైకాపా, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనివల్ల మిగిలిన 9 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 98 మంది అభ్యర్థులు నామపత్రాలు ఉపసంహరించుకున్నారని రిటర్నింగ్ అధికారి ప్రభాకర్ తెలిపారు.
వైకాపా బెదిరింపులకు పాల్పడుతోంది
వైకాపా బెదిరింపులకు పాల్పడుతోందని సీపీఐ ఫిర్యాదు జడ్పీటీసీ, ఎంపీటీసీ, నగరపాలక ఎన్నికల్లో వైకాపా దౌర్జన్యాలకు పాల్పడుతోందని కడప జిల్లా సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు ఆరోపించారు. వైకాపా దౌర్జన్యాలు అరికట్టాలని కోరుతూ ఎన్నికల అధికారి రంజిత్ భాషకు వినతిపత్రం సమర్పించారు. బ్రహ్మంగారిమఠంలో సీపీఎం తరఫున నామినేషన్ దాఖలు చేసిన వ్యక్తిని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు.
కృష్ణా జిల్లాలో
మైలవరంలో అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తోన్న రిటర్నింగ్ అధికారి కృష్ణా జిల్లా మైలవరంలో అభ్యర్థుల పూర్తి వివరాలను రిటర్నింగ్ అధికారి బి.వెంకటేశ్వరరావు వివరించారు. మండలంలోని మొత్తం 19 సెగ్మెంట్లకు గాను 98 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చెయ్యగా.. 55 మంది అర్హులను ఎంపిక చేశామని తెలిపారు. ఇందులో వైకాపా 19, తెదేపా 19 , జనసేన 9, భాజపా 2, సీపీఎం(ఐ) 2, కాంగ్రెస్ 1, స్వతంత్ర అభ్యర్థులు 3 ఉన్నట్లు చెప్పారు. 37 మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా.. ఐదింటిని తిరస్కరించామన్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య 21న ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు.
నిజాంపట్నంలో ఏకగ్రీవం
నిజాంపట్నంలో అన్ని ఎంపీటీసీలు ఏకగ్రీవం గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో ఎన్నడూ లేని విధంగా అన్ని ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో వైకాపా 12, తెదేపా 3, స్వతంత్రులు 2 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు జడ్పీటీసీ స్థానం సైతం అధికార వైకాపా కైవసం చేసుకుంది. దీనిపై వైకాపా శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. రేపల్లె మండలంలో మొల్లగుంట, లంకెవనిదిబ్బలో ఎంపీటీసీ స్థానాలు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. చెరుకుపల్లిలో మొత్తం 85 నామినేషన్లను దాఖలు కాగా 43 ఉపసంహరణ అయ్యి 42 మంది పోటీలో నిలిచారు. ఇక్కడ మొదటి సెగ్మెంట్ ఏకగ్రీవం అయ్యింది. నగరం మండలంలో పెద్దారం ఎంపీటీసీ స్థానాన్ని అధికార పార్టీ ఏకగ్రీవం చేసుకోగా...70 నామినేషన్లకు 43 ఉపసంహరణ అయ్యి 26 మంది పోటీలో నిలిచారు.
తూర్పుగోదావరిలో
ప్రత్తిపాడులో అభ్యర్థుల పోటాపోటీ ప్రచారం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో స్టానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక్కడ అభ్యర్థుల్లో అధిక శాతం మహిళలే కావడం గమనార్హం. ప్రత్తిపాడు రౌతులపూడి, ఏలేశ్వరం మండలాల్లో తెదేపా, వైకాపా మధ్య పోటీ తీవ్రంగా ఉంది. శంఖవరం మండలంలో 5 ఎంపీటీసీ స్థానాలు వైకాపాకు ఏకగ్రీవం అయ్యాయి.
మార్కాపురంలో ఎన్నికలకు తెదేపా దూరం
మార్కాపురంలో ఎన్నికలు బహిష్కరించిన తెదేపా ప్రకాశం జిల్లా మార్కాపురంలో స్థానిక ఎన్నికలకు తెదేపా దూరంగా ఉంది. అధికార వైకాపా నాయకుల వేధింపులు ఎక్కువ కావడం వల్లే తెదేపా ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నామని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆరోపించారు. నిత్యం ఏదో ఒక సాకుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. తాను తెదేపాను వీడుతున్నట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. వైకాపా అరాచకాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు.
ఇదీ చూడండి:
'ఏసు ప్రభువే సీఎం జగన్ మనసు మార్చాలి'