ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతిపై అదే నిర్లక్ష్యం..రాజధాని నిర్మాణానికి కేటాయింపులు సున్నా !

Budget Allocation for Amaravathi: హైకోర్టు ఆదేశిస్తే మాకేంటి..? మేమింతే. అమరావతి విషయంలో మా వైఖరిలో మార్పులేదు. 3 రాజధానులపై హైకోర్టు తీర్పు వెలువడ్డాక..ఇది ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాట. ఆ పెడధోరణిని కొనసాగిస్తూనే.. బడ్జెట్‌లో ప్రజా రాజధానికి నయాపైసా కేటాయించలేదు. కేవలం కౌలు, పేదలకు పింఛను, బ్యాంకులకు వడ్డీ చెల్లింపులకు మాత్రమే నిధులు కేటాయించింది. అదేమంటే.. కేంద్రం నుంచి 8వందల కోట్లు వస్తాయంటూ పద్దుల్లో కాకిలెక్కలు చూపించింది.

zero fund allocation for Amaravati in budget
అమరావతిపై అదే నిర్లక్ష్యం

By

Published : Mar 12, 2022, 5:01 AM IST

Updated : Mar 12, 2022, 5:23 AM IST

బడ్జెట్​లో రాజధాని నిర్మాణానికి కేటాయింపులు సున్నా !

AP Budget Allocation: అమరావతిపై హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం తుంగలో తొక్కింది. బడ్జెట్‌లో అమరావతికి చేసిన కేటాయింపులు చూస్తే హైకోర్టు చెబితే మేం వినేదేంటనే వైఖరి ప్రదర్శించింది. రాజధానిలో నెల రోజుల్లో మౌలిక వసతుల నిర్మాణం పూర్తి చేయాలని.. 3 నెలల్లో రైతులకు లేఅవుట్‌లు అభివృద్ధి చేసి స్థలాలు అప్పగించాలనిహైకోర్టు తీర్పు ఇచ్చింది. మాస్టర్‌ప్లాన్‌ను అనుసరించి 6 నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలనీ ప్రభుత్వానికి విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అధికారంలోకి రాగానే అమరావతి పనులు నిలిపివేసిన ప్రభుత్వం.. కోర్టు తీర్పు తర్వాత కూడా తీరు మార్చుకోలేదు. అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధికి 2022-23 వార్షిక బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడమే దీనికి నిదర్శనం. బడ్డెట్‌ అంకెల్లో మాత్రం 1329.21 కోట్లు కేటాయించినట్టుగా చూపించి కనికట్టు చేసింది. అందులో 800 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయంగా వస్తుందని ఊహించి పెట్టింది.


బడ్జెట్‌ కేటాయింపుల్లో సీఆర్డీఏకి సాయం పేరుతో రూ. 200 కోట్లు కేటాయించింది. అది పూర్తిగా గతంలో రాజధాని నిర్మాణం కోసం హడ్కో, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీలు, అసలు చెల్లించేందుకు ఉద్దేశించింది. వడ్డీలు, అసలు చెల్లించడానికీ ఆ నిధులు కూడా సరిపోని పరిస్థితి. 2021-22 బడ్జెట్‌లో సవరించిన అంచనాల ప్రకారం రుణాలపై వడ్డీలు, అసలు చెల్లించేందుకు సంవత్సరానికి రూ. 550 కోట్లు కావాలి. కానీ బడ్జెట్‌లో రూ. 200 కోట్లే చూపించారు. 'రాజధాని ప్రాంత సామాజిక భద్రతా నిధి ’ పేరుతో మరో రూ. 121.11 కోట్లు ప్రతిపాదించారు.

అమరావతి గ్రామాల్లోని భూమిలేని పేదలకు ప్రతి నెలా కౌలు చెల్లించేందుకు, ఇతర సామాజిక కార్యక్రమాలకు ఈ కేటాయింపులు చేశారు. ‘కొత్త రాజధాని కోసం భూసమీకరణ’ పేరుతో మరో రూ. 208.10 కోట్లు కేటాయించారు. రాజధాని నిర్మాణానికి భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు నిమిత్తం చెల్లించాల్సిన మొత్తం ఇది. ఈ మూడు కేటాయింపులు రాష్ట్ర ప్రభుత్వం విధిగా చేయాల్సిందే .. అందులోనూ మరో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి నిధులు వెచ్చించింది.

కొత్త రాజధాని నగరంలో అత్యవసర మౌలిక వసతుల అభివృద్ధి’పేరుతో రూ. 800 కోట్లు బట్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం వచ్చే హెడ్‌ కింద చూపింది. ఇదే హెడ్‌ కింద గత బడ్జెట్‌లోనూ రూ. 500 కోట్లు ప్రతిపాదించింది. కానీ 2021-22 సవరించిన బడ్జెట్‌ అంచనాల ప్రకారం చూస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. అప్పట్లో తెదేపా ప్రభుత్వం రాజధానికి ఆర్థిక సాయం కోసం సుమారు రూ. 69 వేల కోట్లతో నీతి ఆయోగ్‌కి డీపీఆర్‌లు పంపింది.

వైకాపా వచ్చాక రాజధాని నిర్మాణ పనులు నిలిపివేయడంతో పాటు, నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులివ్వాలని కేంద్రాన్ని అడిగిన దాఖలాలు లేవు. కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న గ్యారంటీ లేకపోయినా.. బడ్జెట్‌లలో మాత్రం రూ. 800 కోట్లు వస్తాయని ప్రతిపాదించడం ప్రజల్ని మోసం చేయడమేననే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి:

AP-BUDGET: రూ.2.56 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌

Last Updated : Mar 12, 2022, 5:23 AM IST

ABOUT THE AUTHOR

...view details