ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని తెదేపా నేత పట్టాభిరామ్, ఇతరులు అసభ్య పదజాలంతో దూషించినందకు.. వైకాపా శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపారు. పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారుి. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విశాఖ జిల్లా:విశాఖ తాటిచెట్లపాలెం జాతీయ రహదారిపై జరిగిన నిరసనలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. గాజువాకలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సీఎం జగన్‌ను తెదేపా నాయకులెవరైనా అనకూడని మాటలు అంటే చంద్రబాబు ఇంటిపై దాడిచేస్తామని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.
విజయనగరం జిల్లా: విజయనగరం గంటస్తంభం కూడలి వద్ద నిరసన కార్యక్రమంలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ సురేష్‌బాబు మాట్లాడారు.
శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి నిరసన తెలియజేశారు. కాశీబుగ్గలో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా ఓ వైకాపా కార్యకర్తపై పెట్రోలు పడటంతో ముఖానికి గాయాలయ్యాయి.
తూర్పుగోదావరి జిల్లా: వేమగిరి కూడలిలో ఎంపీ మార్గాని భరత్‌రామ్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... పట్టాభితో సీఎం జగన్‌ను తిట్టించడం హేయమైన చర్య అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా:వైకాపా నాయకులు సీఎం జగన్ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. ఏలూరు, దెందులూరు, తణుకు, భీమవరం, చింతలపూడిలలో నిరసనలు నిర్వహించారు. బుట్టాయగూడెంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, గణపవరం మండలం సరిపల్లిలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, పాలకొల్లులో జడ్పీ ఛైర్మన్ కవురు శ్రీనివాస్ పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా: తిరువూరులో ఎమ్మెల్యే రక్షణనిధి, ముదినేపల్లి, బంటుమిల్లి, సీతనపల్లిలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పైబర్‌నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ గౌతంరెడ్డి ఆధ్వర్యంలో ముత్యాలంపాడులో, ఎమ్మెల్యే పార్థసారధి ఆధ్వర్యంలో కానూరులో ప్రదర్శన నిర్వహించారు.