YSRCP Plenary: వైకాపా ప్లీనరీలో శుక్రవారం తొలిరోజు కార్యక్రమాలు కోలాహలంగా జరిగాయి. ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సులు, ఇతర వాహనాల్లో రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో తరలివచ్చారు. గుంటూరు జిల్లాలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఎదురుగా ఉన్న స్థలంలో జరుగుతున్న ప్లీనరీకి పార్టీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. వాటర్‌ప్రూఫ్ టెంట్లు వేయడంతో శుక్రవారం వర్షం కురిసినా.. కార్యక్రమం సజావుగానే సాగింది.
ప్లీనరీకి ప్రభుత్వం కొన్ని వేలమంది పోలీసుల్ని మోహరించింది. భోజనాల నుంచి.. అడుగడుగునా పోలీసుల పర్యవేక్షణ కనిపించింది. వైకాపా వాలంటీర్ల కంటే పోలీసులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో సీఎం జగన్ ప్రారంభోపన్యాసం, పార్టీ గౌరవాధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్నట్టు వై.ఎస్.విజయమ్మ ప్రకటించడం తొలి రోజు ప్రత్యేకతలు. మహిళా సాధికారత- దిశ చట్టం, విద్య, నవరత్నాలు- నగదు బదిలీ, వైద్యం అన్న నాలుగు అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టారు.
ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశం జరిగింది. దానికి ముందు సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌ను ఎన్నుకునేలా పార్టీ నియమావళిని సవరిస్తూ శనివారం రెండోరోజు ప్లీనరీలో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
స్తంభించిన నాగార్జున యూనివర్సిటీ..వైకాపా ప్లీనరీతో శుక్రవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కార్యకలాపాలు స్తంభించాయి. మంత్రులు, ముఖ్యుల వాహనాలకు యూనివర్సిటీలో పార్కింగ్ కల్పించారు. యూనివర్సిటీ ప్రధాన గేటు మూసేశారు. ఆ గేటులోంచి యూనివర్సిటీ సిబ్బంది వాహనాలనూ వెళ్లనివ్వకపోవడంతో ఇబ్బంది పడ్డారు. యూనివర్సిటీలో శుక్రవారం జరగాల్సిన పలు సెమినార్లు, పరీక్షలు, బీఈడీ పరీక్ష పత్రాల మూల్యాంకనం వంటి కార్యక్రమాలను వాయిదా వేశారు.