వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశం కృష్ణా జలాల వివాదంపై కేంద్రం నుంచి స్పందన లేకపోవడం... పోలవరం నిధులను తిరిగి చెల్లించడంలో జాప్యం.. పునరావాసానికి కావల్సిన రూ.30వేల కోట్లలో ఇప్పటివరకూ పైసా ఇవ్వకపోవడం.. ఆహార భద్రతా చట్టంలో ఏపీకి జరిగిన అన్యాయం... తెలంగాణ నుంచి రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ బకాయిలు రూ.6,112 కోట్లు... ప్రత్యేకహోదాతోపాటు విభజన హామీలు తదితర అంశాలపై సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లేవనెత్తాలని, కేంద్రంపై ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రానికి సంబంధించి పార్లమెంటులో లేవనెత్తాల్సిన పలు అంశాల గురించి ఎంపీలతో సీఎం చర్చించారు. అందులో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి...
కృష్ణా జలాలపై..
తెలంగాణ చర్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేనందువల్లే సుప్రీంకు వెళ్లామన్న విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలి. శ్రీశైలం, సాగర్, పులిచింతలను కేంద్రమే నిర్వహించాలని ఒత్తిడి తేవాలి.
పోలవరంపై:పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారంటే... నిర్మాణ వ్యయమంతా కేంద్రమే భరించాలి. కానీ, రాష్ట్రం ఖర్చు చేశాక తిరిగి ఇస్తామంటోంది. అందులోనూ బకాయి పెట్టింది. పునరావాస పనులకు అవసరమైన రూ.30వేల కోట్లలో పైసా కూడా విడుదల చేయకపోవడంపై ప్రస్తావించాలి.
ఆహార భద్రత చట్టం:ఆహార భద్రత చట్టం విషయంలో ఏపీకి నష్టం జరిగింది. గ్రామీణ ప్రాంతాల కార్డులు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలలో 76% కవర్ అవుతుంటే ఏపీలో 60% కవర్ అవుతున్నాయి. ఇలాంటి అసమానతలను తొలగించి రాష్ట్రానికి రావాల్సిన రేషన్ రాయితీని కేంద్రం ఇచ్చేలా ఒత్తిడి తేవాలి.
ఇంకా..
* శ్రీశైలం నుంచి 800 అడుగుల్లోపే నీటిని తీసుకునేందుకు రాయలసీమ ఎత్తిపోతలకు అనుమతినివ్వాలి.
* వంశధార ప్రాజెక్టు విషయంలో ట్రైబ్యునల్ తీర్పు ఏపీకి అనుకూలంగా వచ్చింది. దాన్నే కేంద్రం నోటిఫై చేయాలి.
* స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరించకుండా, ఆ సంస్థను కాపాడేందుకు క్యాప్టివ్ మైన్‌ను కేటాయించాలి లేదా సెయిల్/ఎన్‌ఎండీసీలో ప్లాంటును విలీనం చేయాలి.
* 2014-17మధ్య ఏపీ నుంచి తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్ బిల్లులు రూ.6.112 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదు. గతంలో ఇలాంటి సమస్యలొస్తే కేంద్రమే పరిష్కరించేది. పన్నుల్లో తెలంగాణ రాష్ట్రానికిచ్చే వాటాలో రూ.6,112 కోట్లను మినహాయించి.. ఆ మొత్తాన్ని ఏపీకి ఇవ్వాలి.
* పీఎంఏవై కింద రాష్ట్రంలో చేపడుతున్న 17వేల లే అవుట్లలో మౌలికసదుపాయాల కల్పనకు నిధులను కేంద్రం ఇవ్వాలి.
ఎవరికి వారు మీడియా ముందుకు వెళ్లొద్దు
‘పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభలో, బయట పార్టీపరంగా అమలు చేయాల్సిన వ్యూహం, అంశాలవారీగా పార్టీ విధానం గురించి ఎంపీలు ఎవరికి వారు మీడియా ముందుకు వెళ్లి మాట్లాడకండి’ అని ఎంపీలకు సీఎం జగన్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఏ విషయంపై ఎలా స్పందించాలో పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డిలతో మాట్లాడాలని, లేదా కనీసం ముగ్గురు నలుగురు ఎంపీలు చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చాకే మీడియా ముందుకు వెళ్లాలని సూచించినట్లు సమాచారం. పార్లమెంటులో మాట్లాడాల్సిన అంశాలపైనా సమన్వయంతో ముందుకు వెళ్లాలని సీఎం ఎంపీలకు చెప్పారు.
వాస్తవాలను ముందుంచి కేంద్రాన్ని నిలదీస్తాం
‘కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా తగ్గడంపై విశ్లేషించి వాస్తవాలను పార్లమెంటు ముందుంచడం ద్వారా కేంద్రప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించాం’ అని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు. సమావేశం తర్వాత ఆయన విలేకర్లతో మాట్లాడారు. కృష్ణా జలాలపై సీఎంలిద్దరూ కూర్చుని మాట్లాడుకోకపోయినా చర్చలు జరుగుతున్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
రఘురామ.. విలువల్లేని వ్యక్తి
ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు విషయమై చర్చించారా అని విలేకరులు అడగ్గా.. విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. ‘విలువల్లేని ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తికి మేం సమాధానమిస్తాం. అంతే తప్ప అలాంటి వ్యక్తి విషయమై సీఎం స్థాయిలో చర్చించాల్సిన అవసరం ఏముంటుంది? అదంత ప్రధానమైన అంశమా?’ అని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో కొత్తగా 2,526 కరోనా కేసులు, 24 మరణాలు