పార్లమెంటు సమావేశాల క్రమంలో సోమవారం వైకాపా ఎంపీలతో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దిల్లీలోని ఏపీ భవన్ నుంచి ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మొత్తం 17 అంశాల గురించి ఎంపీలకు ముఖ్యమంత్రి వివరించారు. తెదేపా ప్రస్తావించే అంశాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా ఉంటే వెంటనే తిప్పికొట్టాలన్నారు. నరసాపురం ఎంపీ రఘురామపై అనర్హత వేటుపైనా మాట్లాడాలని నిర్ణయించారు. వైకాపా కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం సీఎం ఏంచెప్పారంటే..
పోలవరానికి నిధులు అడగండి
ప్రాజెక్టు పనులకు రావాల్సిన రూ.3,232 కోట్లు, ప్రాజెక్టులో 41.5 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేందుకు పునరావాస పనులకు రూ.3 వేల కోట్లు ఇచ్చేలా ఒత్తిడి తేవాలి. ప్రాజెక్టుకు ఇంకా రూ.30 వేల కోట్లకుపైగా వ్యయమవుతుందనీ పార్లమెంటులో ప్రస్తావించాలి.
- కొవిడ్ నేపథ్యంలో బకాయిలున్న జీఎస్టీ పరిహారం రూ.3,622 కోట్లు, పౌరసరఫరాల సంస్థకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.1300 కోట్ల విడుదలకు పట్టుబట్టాలి. స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం కింద రావాల్సిన రూ.582 కోట్లను రాబట్టాలి.
- గరీబ్ కల్యాణ్ పథకంలో ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని 7జిల్లాలను చేర్చాలని కేంద్రాన్ని కోరాలి.
- ఏపీ దిశ బిల్లు, ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వేర్వేరుగా ఏర్పాటు చేస్తూ చేసిన బిల్లును ఆమోదించాలని పార్లమెంటులో ప్రస్తావించాలి.
- శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానించి పంపినా కేంద్రం పట్టించుకోలేదు.దీనిపై మాట్లాడాలి.
పక్క రాష్ట్రాల లాబీ: మిథున్ రెడ్డి