GORANTLA MADHAV: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లున్న వీడియో ఒకటి రాష్ట్రంలో గురువారం కలకలం రేపింది. ఉదయం 8 గంటల సమయంలో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన ఈ వీడియో.. కొద్దిసేపటికే విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఎంపీ మాధవ్ నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడటాన్ని రికార్డు చేసి, ఆ వీడియోను మరో ఫోన్‌తో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. బుధవారం రాత్రి ఫేస్‌బుక్ మెసెంజర్‌లో తొలుత ఈ వీడియో వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కాసేపటికి ట్విటర్‌లోనూ కొంతమంది దాన్ని షేర్ చేశారు. గురువారం ఉదయం ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. దీనిపై గోరంట్ల మాధవ్ స్పందిస్తూ ఆ వీడియో నకిలీది అనీ, తాను జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియోను మార్ఫింగ్ చేశారని చెప్పారు. ఇదంతా తెదేపా, కొంతమంది మీడియా వ్యక్తుల కుట్ర అని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు.
ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారశైలి తొలి నుంచి వివాదాస్పదమే. ఆయన అనంతపురంలో సీఐగా పనిచేస్తున్నప్పుడు సెటిల్‌మెంట్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడికెళ్లినా, ఎవరితో మాట్లాడినా నోటిదురుసు ప్రదర్శిస్తారనేది ఆయనపై ప్రధానమైన విమర్శ. తెదేపా ప్రభుత్వంలో సీఐగా యూనిఫాంలో ఉండగానే జేసీ దివాకర్‌రెడ్డిని సవాల్ చేస్తూ మీసం మెలేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలా ప్రాచుర్యంలోకి వచ్చిన ఆయనకు వైకాపా హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చింది. కియా పరిశ్రమ ప్రారంభోత్సవ సమయంలోనూ ఆ సంస్థ ఎండీ వైపు చూపుడువేలు చూపిస్తూ బెదిరించిన విషయం తెలిసిందే. పరిశ్రమ నుంచి విడుదలైన మొదటి కారుపై సంతకాలు చేసే సమయంలోనూ కియా గురించి వ్యతిరేకంగా వ్యాఖ్య రాయడం వివాదంగా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మాధవ్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం ఆయనపై మొత్తం రెండు కేసులున్నాయి. అత్యాచారం, హత్య, నేరపూరిత బెదిరింపు వంటి అభియోగాలతో ఆయనపై కర్నూలు జిల్లాలో ఓ కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కూడా ఆయనపై అభియోగాలున్నాయి. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని.. బెదిరించారని, నాలుక కోసేస్తానంటూ హెచ్చరించారన్న ఫిర్యాదుపై 2019లో తాడిపత్రి పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది.