చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలని నిలిపివేయాలని ఎస్ఈసీ ఆదేశాలివ్వడంపై వైకాపా మండిపడింది. ఎస్ఈసీ దిగజారి, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ ధ్వజమెత్తారు. పంచాయతీలోని పెద్దలంతా కూర్చుని సమర్థుడైన వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని...దానిని నిలుపుదల చేసే అధికారం ఎస్ఈసీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఏకగ్రీవాలు తప్పు అయితే కోర్టుకు వెళ్లి ఆదేశాలు తీసుకురావాలని సూచించారు. ఏకగ్రీవాలు వద్దని ఎస్ఈసీ చట్టం చేయగలరా అని నిలదీశారు.
ప్రజల విలువలు, అధికారాలను కాలరాసే అధికారం ఎస్ఈసీకి ఎవరిచ్చారని...ఏకగ్రీవాలు చేయకూడదనే నిబంధన ఏమైనా నిమ్మగడ్డ పెట్టారా అని ప్రశ్నించారు. రూల్స్ తెలియని వ్యక్తిని, అసమర్ధుడిని ఎస్ఈసీగా చంద్రబాబు నియమించారని ఆక్షేపించారు. తెదేపా మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబుపై చర్య తీసుకోవాలని తాము కోరామని...కానీ చర్యలు తీసుకోకుండా మేనిఫెస్టోను రద్దు చేయడం సరైంది కాదన్నారు. 90శాతానికిపైగా వైకాపా బలపరిచిన సర్పంచి అభ్యర్థులే గెలవబోతున్నారని ఎమ్మెల్యే జోస్యం చెప్పారు.