ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

POLLUTION BOARD: వారు నిపుణులేనట..!

కాలుష్య నియంత్రణ మండలిలో వైకాపా నాయకులకు చోటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారిని అధికారేతర నిపుణుల హోదాలో సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

POLLUTION BOARD
POLLUTION BOARD

By

Published : Aug 11, 2021, 3:48 AM IST

ఒకరేమో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం పరిధిలోని వేముల మండల మాజీ జడ్పీటీసీ, వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తి. ఇంకొకరేమో వైకాపా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తి. మరొకరేమో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే. కాలుష్య నియంత్రణ మండలిలో అధికారేతర నిపుణుల హోదాలో ఈ ముగ్గురికి రాష్ట్ర ప్రభుత్వం చోటు కల్పించింది. కాలుష్య నియంత్రణ మండలి బోర్డును పునర్‌నియమిస్తూ అటవీ శాఖ కార్యదర్శి జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. అటవీ, పురపాలక-పట్టణాభివృద్ధి, వైద్యారోగ్య శాఖల కార్యదర్శులు, పరిశ్రమలు, రవాణా శాఖల కమిషనర్లు, ఏపీఐఐసీ, ఏపీఎండీసీ ఎండీలను వారి వారి హోదాల రీత్యా కమిటీలో సభ్యులుగా నియమించింది. స్థానిక సంస్థల నుంచి విశాఖపట్నానికి చెందిన డా.మహ్మద్‌ సాధిక్‌కు చోటు కల్పించింది. వీరు కాకుండా అధికారేతర నిపుణుల హోదాలో కడప జిల్లా వేముల మండలానికి చెందిన వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మరకా శివకృష్ణారెడ్డి, ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి వెన్న హనుమారెడ్డి, చిత్తూరు జిల్లా పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే, వైకాపా నాయకుడు డా.ఎం.సునీల్‌కుమార్‌లను నియమించింది. వారు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. సాధారణంగా కాలుష్య నియంత్రణ మండలిలో అధికారేతర నిపుణుల హోదాలో సభ్యులుగా ఉండేవారు కొంత నిష్ణాతులై ఉండాలి. తాజాగా నియమితులైన వారికి తగిన నిపుణత లేకపోయినా నియమించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వారి నేపథ్యాలు ఇలా...

*మరకా శివకృష్ణారెడ్డి డిగ్రీ వరకూ చదివారు. న్యాయవిద్యను మధ్యలో ఆపేశారు. వేముల మండలం పరిధిలోని యురేనియం కాలుష్యంపై కొన్నిసార్లు ప్రజల తరపున మాట్లాడారు. కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డికి అనుచరుడు. ప్రస్తుతం వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

*వెన్నా హనుమారెడ్డి ఎంబీఏ, ఎంకాం, బీఈడీ చదివారు. ఇందిరా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ విద్యాసంస్థకు ఛైర్మన్‌గా ఉన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ నియోజకవర్గం నుంచి వైకాపా తరపున అభ్యర్థిగా పోటీ చేసేందుకు 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ టిక్కెట్టు కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. 2014 తర్వాత ఆ పార్టీకి కొన్నాళ్ల పాటు నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. ప్రస్తుతం వైకాపా రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

*డా.ఎం.సునీల్‌కుమార్‌ వైద్య విద్యనభ్యసించారు. 2014లో చిత్తూరు జిల్లా పూతలపట్టు నుంచి వైకాపా తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో వైకాపా టిక్కెట్టు కోసం ఆశించి భంగపడ్డారు. ప్రస్తుతం ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు.

వారిని ఎలా తొలగించారు! వీరిని ఎలా నియమించారో!!

త ప్రభుత్వ హయాంలో కాలుష్య నియంత్రణ మండలిలో అధికారేతర సభ్యులు (నాన్‌ అఫీషియల్‌ మెంబర్స్‌)గా నియమితులైన పరుచూరి కృష్ణ, డా.దొమ్మేటి వెంకట సుధాకర్‌, జి ఆదెన్నలను గతేడాది మే 29న వైకాపా ప్రభుత్వం తొలగించింది. వారి పదవీకాలం ఇంకా ఉండగానే తీసేసింది. వీరి ముగ్గురికీ అధికారేతర సభ్యులుగా కొనసాగేందుకు తగిన నిపుణత లేదని, మండలి సమావేశాల్లో తగిన సాంకేతిక భాగస్వామ్యం (టెక్నికల్‌ కాంట్రిబ్యూషన్‌) లేదని పేర్కొంటూ వారిని బోర్డు నుంచి తొలగించింది. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన వారు నిపుణులు కారని వారిని పేర్కొంటూ సభ్యులుగా తొలగించేసిన వైకాపా ప్రభుత్వం.. ఇప్పుడు కొత్త సభ్యులుగా నిపుణులు కాని వారిని, రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న పార్టీ నాయకులను ఎలా నియమించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా పర్యావరణ, కాలుష్య సంబంధిత అంశాల్లో నిష్ణాతులైన వారిని అధికారేతర నిపుణులుగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది తప్ప.. రాజకీయ పునరావాసం కల్పించేందుకు ఆ పదవులు ఇవ్వడం సరికాదని ఓ విశ్రాంత ఐఎఫ్‌ఎస్‌ అధికారి తెలిపారు.

ఇదీ చదవండి:

PRIVATE SCHOOLS: గతంలో హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేతపై నేడు విచారణ

ABOUT THE AUTHOR

...view details