YSRCP LEADERS POOJALU : మూడు రాజధానులకు మద్దతుగా.. దసరా సందర్భంగా.. అధికార పార్టీ నేతలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. వికేంద్రీకరణ బిల్లుకు.. న్యాయపరమైన చిక్కులు తొలగిపోవాలంటూ.. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో మంత్రి రోజా 108 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఆమదాలవలస పాల పోలమ్మ ఆలయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో 108 కొబ్బరికాయలు కొట్టారు. మూడు రాజధానులకు ప్రతిపక్షాలు సహకరించాలని సభాపతి కోరారు.
శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలిలోని దుర్గామాత ఆలయంలో.. స్థానిక నేతలతో కలసి మంత్రి ధర్మాన ప్రసాదరావు పూజలు చేశారు. విశాఖ పరిపాలన రాజధానికి మద్దతుగా.. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయంలో.. వైకాపా నేతలు వెయ్యి టెంకాయలు కొట్టారు. అమరావతి రైతులు.. పాదయాత్ర పేరిట ఉత్తరాంధ్రలో అడుగుపెట్టడం ఎంతవరకు సమంజసమని.. శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ జరగాలంటూ.. సాలూరు శామలాంబ ఆలయంలో.. ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర పూజలు చేశారు.