"మేం చెప్పిందే చేయాలి.. లేదంటే దౌర్జన్యం చేస్తాం.
మేం అక్రమాలు చేస్తున్నా చూస్తూ ఉండాలి.. కాదంటే దాడులకు దిగుతాం.
మేం తిట్టినా పడుండాలి.. ఫిర్యాదు చేస్తామని పోలీసుస్టేషన్‌కు వెళ్తే ఎదురుకేసు పెట్టిస్తాం.."
ఇదీ రాష్ట్రంలో కొంతమంది వైకాపా నాయకులు ప్రభుత్వోద్యోగులపై దౌర్జన్యాలకు తెగబడుతున్న తీరు. మేం చెప్పిన పని చేయకుండా మాకే నిబంధనలు చెబుతారా? అంటూ కొందరు అధికార పార్టీల నేతలు రెచ్చిపోతున్నారు. అడ్డుకుంటే దాడులకు దిగుతున్నారు. పలుచోట్ల పోలీసులూ దన్నుగా నిలబడుతుండటం నేతలకు మరింత బలం చేకూరుస్తోంది. అధికార పార్టీ నాయకుల సిఫార్సులతో తమకు కావాల్సిన స్టేషన్లు, సర్కిళ్లలో పోస్టింగు పొందిన ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్‌వోలు ఇలాంటి వాటిపై ఫిర్యాదులొచ్చినా తొక్కిపట్టేస్తున్నారు. తప్పనిసరై కేసు కట్టినా.. మొక్కుబడి సెక్షన్లతో మమ అనిపిస్తున్నారు. ‘అవతలి వ్యక్తులు కూడా మీపై ఫిర్యాదు చేస్తామంటున్నారు.. మీపైనా కేసు కట్టాల్సి వస్తుంది’ అంటూ బాధితుల్ని భయపెట్టి ఫిర్యాదులు వెనక్కి తీసుకునేలా చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది తమపై తరచూ జరుగుతున్న దాడుల గురించి ఫిర్యాదులు చేస్తున్నా బాధ్యులపై కేసులు పెట్టటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలెన్నో తరచూ వెలుగుచూస్తూనే ఉన్నాయి.
మేం చెప్పినా చేయవా?తాను చెప్పిన పని చేయట్లేదని, తన మాట వినట్లేదంటూ తిరువూరు మండలం లక్ష్మీపురం వీఆర్వో కంబాల లోకేశ్వరరావుపై వైకాపా నాయకుడు గోగినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరులు గ్రామ సచివాలయంలోనే దౌర్జన్యానికి దిగారు. అసభ్య పదజాలంతో దూషించారు. నీ సంగతి తేలుస్తామంటూ బెదిరించారు.
ఓటీఎస్ విషయంలో తాను చెప్పినట్లు వినట్లేదంటూ నంద్యాల 38వ వార్డు వైకాపా కౌన్సిలర్ సావిత్రమ్మ కుమారుడు శివ.. సచివాలయ పరిపాలన కార్యదర్శి కేవీ సుధాకర్‌పై దాడి చేశారు. బాధితుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
మట్టి మాఫియాను అడ్డుకోవడానికి వెళ్లిన కానిస్టేబుల్‌పై దాడికృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం జువ్వలపాలెంలోని చెరువులో మట్టిని అక్రమంగా తవ్వుతున్నారన్న ఫిర్యాదు రాగా అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిని వైకాపా నాయకులు చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారు. దాన్ని వీడియో తీస్తున్న కానిస్టేబుల్ బాలకృష్ణను నెట్టేసి, తలపై కర్రతో కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదయింది.
తిరుమలలోనూ 'అధికార' దౌర్జన్యమే :తిరుమల తిరుపతి దేవస్థానంలో గదుల కేటాయింపు వద్ద కూడా వైకాపా నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఎదురుచెప్పిన సిబ్బందిపై దాడి చేస్తున్నారు. మాకే గదులు ఇవ్వవా? అంటూ అయిదుగురు వ్యక్తులు ఇటీవల ఎంబీసీ గదుల కేటాయింపు కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్ వెంకటరత్నంతో గొడవపడ్డారు. వైకాపా నాయకుడు పృథ్వీరాజ్ అలియాస్ బబ్లూ దాడి చేయడంతో వెంకటరత్నానికి తీవ్రగాయాలయ్యాయి.
తిరుమలలోని పద్మావతి విచారణ కేంద్రం సిబ్బంది రవీందర్ నాయక్, ధనుంజయ్‌లపై అనంతపురం వైకాపా నాయకుడు శివారెడ్డి, ఆయన కుమారులు సునీల్‌కుమార్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌లో దాడికి పాల్పడ్డారు. ఈ రెండు ఘటనల్లోనూ బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు.
పర్యాటక శాఖ సిబ్బందిపై వైకాపా కార్పొరేటర్ భర్త అనుచరుల దాడి
ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకునేందుకు నిర్ణీత రుసుములు చెల్లించాలని కోరిన పర్యాటక శాఖ సిబ్బందిపై విజయవాడ 42వ డివిజన్ వైకాపా కార్పొరేటర్ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్‌రెడ్డి సమక్షంలోనే ఆయన అనుచరులు దౌర్జన్యానికి దిగారు. కర్రలు, ఇనుపరాడ్లతో పర్యాటక శాఖ సిబ్బందిపై దాడి చేశారు. విజయవాడలోని హరిత బెర్మ్ పార్కులో వీరంగం సృష్టించారు. దీంతో సిబ్బంది భయంతో పరుగులు తీశారు.
వైకాపా ప్రభుత్వ వార్షికోత్సవ సంబరాలతో ట్రాఫిక్ నిలిచిపోయిందని, దారి ఇవ్వాలని కోరినందుకు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌పై వైకాపా శ్రేణులు దౌర్జన్యానికి దిగాయి. ముష్టికుంట్ల గ్రామంలో మే నెలలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.
ఏఈఈని 'వైకాపా ఎమ్మెల్యే కొడితే కేసే లేదు'
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.. రాజమహేంద్రవరంలో ఈ నెల 1న జరిగిన జలవనరుల శాఖ సమావేశంలో ఉన్నతాధికారుల సమక్షంలోనే ఏఈఈ సూర్యకిరణ్‌పై దౌర్జన్యం చేశారు. నేను చెప్పిన పని చేయరా? అంటూ చెంపదెబ్బలు కొట్టారు. బాధితుడు అదే రోజు ఏఈఈ సంఘ ప్రతినిధులతో కలిసి వెళ్లి రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ రావాలంటూ సిబ్బంది కేసు కట్టలేదు. బాధితుడు అక్కడే ఘటన వివరాల్ని మీడియాకు వెల్లడిస్తుండగా సీఐ వచ్చి ఏఈఈ ఒక్కరినే బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి తలుపులు వేసి, మాట్లాడారు. బయటకొచ్చిన బాధితుడు ఎమ్మెల్యే రాజాపై సీఐకి ఫిర్యాదు ఇచ్చానన్నారు. అయితే ఫిర్యాదేమీ చేయలేదని సీఐ చెప్పడం గమనార్హం. తర్వాత సూర్యకిరణ్‌కు ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పారని, అందుకే ఫిర్యాదు వెనక్కి తీసుకున్నామని ఏఈఈల సంఘం ప్రకటించింది. ఈ వ్యవహారంలో ఫిర్యాదు ఇవ్వనీయకుండా, కేసు కట్టకుండా రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు పనిచేశాయన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికీ ఈ ఘటనపై కేసు నమోదు కాలేదు.
బాధితుడైన ఆర్‌ఐపైనే.. లంచం అడిగారని రివర్స్ కేసు
కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరులో ఏప్రిల్ 21 అర్ధరాత్రి మట్టి అక్రమంగా తవ్వుతున్నారన్న ఫిర్యాదులు రాగా అడ్డుకునేందుకు వెళ్లిన ఆర్‌ఐ జాస్తి అరవింద్‌పై మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులైన వైకాపా నాయకులు దాడి చేశారు. జేసీబీతో ఆయన్ను పక్కకు నెట్టేశారు. గొంతు నొక్కి, ముఖంపై కొట్టి, చొక్కా చింపేశారు. మెడలో బంగారు గొలుసు తెంచేశారు. వైకాపా నాయకుడు గంటా సురేష్ సూచన మేరకు ఆయన తమ్ముడు లక్ష్మణ్‌రావు ఆర్‌ఐ అరవింద్‌ను చంపుతామంటూ భౌతికదాడికి దిగారు. మీడియాలో విస్తృత ప్రచారం కావటంతో ఆర్‌ఐ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్‌ఐ తనను లక్ష రూపాయలు లంచం అడిగారని, తర్వాత రోజు ఇస్తానని చెప్పినా వినలేదంటూ అతనిపై దాడి చేసిన వైకాపా నాయకుడు గంటా లక్ష్మణరావు ఫిర్యాదు ఇచ్చారంటూ నాలుగు రోజుల తర్వాత అరవింద్‌పై పోలీసులు రివర్స్ కేసు పెట్టారు. బాధితుణ్ని బెదిరించేందుకే ఇలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇవీ చూడండి: