ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

YSRCP affidavit అమ్మఒడి, రైతుభరోసాలను ఉచిత పథకాలనడం అభ్యంతరకరమన్న వైకాపా

YSRCP affidavit ఉచిత పథకాలను నిలువరించేలా ఉత్తర్వులు జారీచేయాలన్న పిటిషన్‌పై వైకాపా స్పందించింది. ఏపీ సర్కారు అమలు చేస్తున్న అమ్మ ఒడి, రైతుభరోసా లాంటి పథకాలను ఉచితాలుగా అభివర్ణించడం తీవ్ర అభ్యంతరకరమంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఏదైనా కమిటీ వేస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత సాధికారత కల్పించాలని కోరింది. ప్రభుత్వాలు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించే మార్గాలను సిఫార్సు చేయాలని సుప్రీంకోర్టుకు విన్నవించింది.

YSRCP affidavit
వైకాపా అఫిడవిట్​

By

Published : Aug 18, 2022, 8:30 AM IST

YSRCP affidavit ఉచిత పథకాలను నిలువరించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై వైకాపా స్పందించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి, రైతుభరోసా లాంటి పథకాలను ఉచితాలుగా అభివర్ణించడం దురదృష్టకరం, తీవ్ర అభ్యంతరకరమంటూ సుప్రీంకోర్టులో తాజాగా అఫిడవిట్‌ దాఖలు చేసింది. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఇప్పుడు అంతటా ఆర్థిక సుస్థిరతపై స్పృహతోపాటు, అప్పుల భారాన్ని తగ్గించుకోవాలన్న అవగాహన పెరిగినట్లు అభిప్రాయపడింది. ‘గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై భారం పెరిగిపోయింది. కొవిడ్‌ మహమ్మారితో పాటు, మందగమనం కూడా చుట్టుముట్టడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ప్రభుత్వాల ఆదాయాలు దారుణంగా పడిపోయాయి. అయినప్పటికీ ప్రజల ప్రాణాలు, జీవనోపాధిని రక్షించడానికి ప్రభుత్వ వ్యయాన్ని పెంచాల్సిన అవసరం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వంపై రుణభారం 2020-21లో ఆందోళనకర స్థాయిలో పెరిగింది. అయినప్పటికీ కేంద్రం ఖర్చుపెట్టడం వల్ల ప్రజల ప్రాణాలతోపాటు, ఆర్థిక వ్యవస్థకు భద్రత ఏర్పడింది. తదుపరి ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల కేంద్ర ప్రభుత్వ రుణ-జీడీపీ నిష్పత్తి 2020-21లో 61% నుంచి 2021-22 నాటికి 57.42%కి తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అత్యధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుండటంతో ఆర్థిక పరిస్థితులు కూడా అంతే స్థాయిలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కేంద్రం పన్నుల్లో సెస్‌, సర్‌ఛార్జిల వాటా పెంచడం వల్ల రాష్ట్రాలకు వాటా తగ్గిపోయి మరింత ఇబ్బందులు పడుతున్నాం. 2015-16లో స్థూల పన్ను ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌కు 1.5% వాటా దక్కగా 2021-22 నాటికి 1.32%కి తగ్గిపోయింది. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు 41% వాటా సిఫార్సు చేసినప్పటికీ 2020-21లో కేవలం 29.35% మాత్రమే దక్కింది’ అని పేర్కొంది.

అప్పుల భారం తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం

‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంపై అప్పుల భారం తగ్గించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2021-22కి కాగ్‌ విడుదల చేసిన లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలను చాలా వివేకంగా నిర్వహిస్తూ, రెవెన్యూ లోటును రూ.8,370.51 కోట్లు, ఆర్థిక లోటును రూ.25,194.62 కోట్లకు పరిమితం చేసింది. దానివల్ల రుణ-జీఎస్‌డీపీ నిష్పత్తి 2.10%కి తగ్గిపోయింది. ప్రజల బాధలు, ఇబ్బందులను పూర్తిగా తొలగించకపోతే ఎన్నికైన ప్రభుత్వ బాధ్యత పూర్తయినట్లు కాదు. ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీ కాబట్టి సమ్మిళిత పురోగతి కోసం పథకాలను రూపొందించి అమలు చేయాలి. రాజ్యాంగంలోని పార్ట్‌-4లో చెప్పిన విధంగా విద్య, వైద్యం, మహిళా సాధికారత, వ్యవసాయం, గృహనిర్మాణం, పేదల అభ్యున్నతి, వయోవృద్ధులు, అవసరమైన వారికి ఉచిత పథకాలు అందించి మద్దతుగా నిలవడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత’ అని అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏదైనా కమిటీ ఏర్పాటు చేస్తే అది రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత సాధికారత కల్పించాలని కోరింది. తద్వారా ప్రభుత్వాలు తమ బాధ్యతలను ఇంకా సమర్థంగా నిర్వహించే మార్గాలను సిఫార్సు చేసేలా చూడాలని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details