YSR Jalakala scheme: రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు తవ్వి, పంపుసెట్లు పెట్టి విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వైఎస్సార్ జలకళ పథకాన్ని తీసుకొచ్చింది. తొలుత బోర్లు తవ్వి, పంపుసెట్లు ఇస్తామని ప్రకటించింది. విద్యుత్తు కనెక్షన్లు కూడా ఉచితంగా అందిస్తామని తర్వాత వెల్లడించింది. ఈ పథకం కింద.. రైతుల నుంచి 2లక్షల 21వేల 247 దరఖాస్తులు రాగా..16వేల 423బోర్లు తవ్వారు. ఉచితంగా పంపుసెట్లు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే తీవ్ర తర్జనభర్జనల తర్వాత కనెక్షన్లకు అయ్యే ఖర్చును రైతులే భరించాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2024 నాటికి.. రెండున్నర లక్షల బోర్లు తవ్వాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే.. విద్యుత్ కనెక్షన్లకే కోట్లాది రూపాయలు అవసరమని భావించిన ప్రభుత్వం.. చివరకు ఈ భారం రైతులపైనే వేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయం జిల్లా జల యాజమాన్య సంస్థలకు ఉత్తర్వులు జారీ చేసింది. పొలాల్లో బోర్ల తవ్వకం, పంపుసెట్లకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని.. విద్యుత్తు కనెక్షన్ల ఖర్చు రైతులే భరించాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు.