వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను వైకాపా ఖరారు చేసింది. దీనికి సంబంధించి అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయా ప్రాంతాల వైకాపా ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా చర్చించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి ఎన్నికలకు ఏడెనిమిది నెలల ముందే అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడారు.
‘గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్రులు, ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులకు మద్దతు ఇవ్వడమో, ఎన్నికల నుంచి దూరంగా ఉండటమో చేశాం.. ఇకపై ఆ ఎన్నికల్లో పార్టీ పూర్తి స్థాయిలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది’ అని ఎమ్మెల్యేలతో ఆయన సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో చర్చించారు. పేర్లను ఖరారు చేశారు. విశాఖ-శ్రీకాకుళం-విజయనగరానికి బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్, అనంతపురం-కడప-కర్నూలుకు వెన్నపూస రవీంద్రరెడ్డి (ఈయన అదే స్థానంలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెన్నపూస గోపాల్‌రెడ్డి కుమారుడు), చిత్తూరు-ప్రకాశం-నెల్లూరు జిల్లాల నియోజకవర్గానికి పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డిల పేర్లను ఖరారు చేశారు.