ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు సి.రామచంద్రయ్య, దువ్వాడ శ్రీనివాస్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరథరెడ్డి, కరీమున్నీసా, షేక్ మహమ్మద్ ఇక్బాల్‌లను అభ్యర్థులుగా వైకాపా ప్రకటించింది. వీరిలో ఇద్దరు ముస్లిం మైనారిటీలకు చెందినవారు కాగా ఎస్సీ, కాపు, కాళింగ, రెడ్డి సామాజికవర్గాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేసిన అభ్యర్థుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైకాపా కేంద్ర కార్యాలయంలో గురువారం ప్రకటించారు.
పలువురికి ఆశాభంగం
2019 ఎన్నికలకు ముందు, పాదయాత్ర సమయంలో పలువురికి ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీనిచ్చారు. వారిలో ఎక్కువ మంది ఇప్పుడు అవకాశం వస్తుందని ఆశించారు. ఇటీవల గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాలో దాదాపు అవకాశం వచ్చినట్లే వచ్చి వెనక్కిపోయిన మోషేను రాజుకు ఇప్పుడు ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఆయనకు అవకాశం రాలేదు. గుంటూరు జిల్లాలో మర్రి రాజశేఖర్‌ను మంత్రిమండలిలోకి తీసుకుంటానని జగన్ లోగడ బహిరంగంగా ప్రకటించారు. అందువల్లే అప్పట్లో ఆయన టికెట్‌ను వదులుకున్నారు. ఆయన్ను మంత్రిమండలిలోకి తీసుకోవాలంటే ముందు ఎమ్మెల్సీని చేయాల్సి ఉంది. ఆయనకూ ఇప్పుడు అవకాశం లేకపోయింది. ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి పిల్లి సుభాష్‌చంద్రబోస్ రాజీనామాతో ఖాళీ అయింది. ఆ స్థానాన్ని తూర్పుగోదావరి జిల్లాకే చెందిన తోట త్రిమూర్తులుకు ఇస్తారన్న చర్చ జరిగినప్పటికీ ఆయనకూ అవకాశం రాలేదు. గన్నవరంలో దుట్టా రామచంద్రరావు, చీరాలలో ఆమంచి కృష్ణమోహన్, రాజంపేటలో ఆకేపాటి అమర్‌నాథరెడ్డిలాంటి వారికీ ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని ముఖ్యమంత్రి హామీనిచ్చారని అంటున్నారు. వచ్చే 2నెలల్లో ఖాళీ అయ్యే స్థానాల్లో వారిలో కొందరికి అవకాశమిస్తారని వైకాపా నేతలు చెబుతున్నారు.
రామచంద్రయ్య
గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఈయనకు ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని జగన్ లోగడ హామీనిచ్చారు. లోగడ ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం రామచంద్రయ్యకు ఉంది.
దువ్వాడ శ్రీనివాస్
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన నాయకుడు. సార్వత్రిక ఎన్నికల్లో టెక్కలి కాదని, శ్రీకాకుళం లోక్‌సభ స్థానంలో పోటీ చేయాలని పార్టీ నాయకత్వం చెప్పడంతో తదనుగుణంగా బరిలో దిగి ఓడిపోయారు. పంచాయతీ ఎన్నికల్లో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలిలో ఎక్కువ స్థానాలను వైకాపా మద్దతుదారులు కైవసం చేసుకోవడం వెనక దువ్వాడ భాగస్వామ్యం కూడా ఉందని అంటున్నారు. అచ్చెన్నాయుడిలాంటి నాయకుడిని ఆ నియోజకవర్గంలో దీటుగా ఎదుర్కొనేందుకు దువ్వాడకు పదవి ఉండాలని ఇప్పుడు అవకాశమిచ్చారంటున్నారు.