తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ అధ్యక్షతన వ్యవసాయ మిషన్ సమావేశం శనివారం జరిగింది. దీనిలో ధరల స్థిరీకరణ నిధి, రైతు భరోసా మార్గదర్శకాలతో పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఉభయ గోదావరి, రాయలసీమ ప్రాంతాల్లో ప్రధాన సామాజికవర్గాల నుంచి అధిక సంఖ్యలో ఉన్న కౌలు రైతులకూ భరోసా కల్పించాలని ఎమ్మెల్యేలు కోరుతున్న అంశం ఈ భేటీలో చర్చకొచ్చింది. కౌలు రైతుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వారికి రైతు భరోసా వర్తింపచేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. సొంత భూమి ఉన్నా, రెవెన్యూ దస్త్రాలు లేక రైతు భరోసా అందలేదనే ఫిర్యాదులు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు.
పంట కోతకు వచ్చే సమయానికి కొనుగోలు కేంద్రాలు
అక్టోబర్ 15 నాటికే పంట కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని జగన్ సూచించారు. పంట కోతలు మొదలవటానికి 15 రోజుల ముందే వీటిని తెరవాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, మార్కెటింగ్‌పై నిపుణులతో ఒక సెల్ ఏర్పాటు చేయాలన్నారు. టమాటా ధరలు పడిపోవడాన్ని జగన్ ప్రస్తావించగా కర్ణాటక, మహారాష్ట్రలోనూ అధికంగా టమాటా వస్తున్న కారణంగా కొన్నాళ్లు ఇదే పరిస్థితి ఉండొచ్చని అధికారులు వివరించారు. అవసరమైతే చిత్తూరు, అనంతపురం మార్కెట్ల నుంచి ప్రభుత్వమే లారీలు ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాలకు టమాటా తరలించే అంశాన్ని పరిశీలించమని సూచించారు. కిలోకు మూడు రూపాయల కన్నా ధర తక్కువకు పడిపోతే మార్కెట్ జోక్యం కింద మద్దతు అందించాలని సమావేశంలో నిర్ణయించారు.
చివరి భూమి వరకూ నీరు
గత ఖరీఫ్ పంట నష్టానికి సంబంధించిన పెట్టుబడి రాయితీని ఈ నెలాఖరులోగా విడుదల చేయాలని ఎండిపోతున్న బత్తాయి, తదితర పంటలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా నదిలో నీళ్లున్నా అవనిగడ్డ, పెడన ప్రాంతాలకు వెళ్లటం లేదని ఆధునికీకరణ పనులు పూర్తి చేసి చివరి భూముల వరకూ నీరు వెళ్లేలా చూడాలని అనుకున్నారు. హంద్రీనీవా కాలువలకు 3వేల 600 క్యూసెక్కులు తీసుకునే వీలున్నా 2వేల 200 క్యూసెక్కులు మాత్రమే తీసుకుంటున్నందున అవసరమైతే సమాంతరంగా మరో కాల్వ తవ్వే అంశంపైనా వ్యవసాయ మిషన్ సమావేశంలో చర్చించారు.