ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కాపు నేస్తం'లో 41వేల పేర్లు గల్లంతు.. లబ్ధిదారుల్లో ఆందోళన - కాపు నేస్తం

45-60 ఏళ్లలోపు మహిళలకు ఏటా రూ.15 వేలు సాయం అందించే కాపు నేస్తం పథకం లబ్ధిదారుల జాబితాలో 41 వేల పేర్లు గల్లంతయ్యాయి. నిరుడు 3.27 లక్షల మందికి సాయం అందగా.. ఈ దఫా 2.85 లక్షల మంది జాబితానే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లింది. పేర్లు లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటున్నారు సచివాలయ కార్యదర్శులు.

Kapu nestam
కాపు నేస్తం

By

Published : Jun 26, 2022, 5:20 AM IST

కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన 45-60 ఏళ్లలోపు మహిళలకు ఏటా రూ.15 వేలు సాయం అందించే కాపు నేస్తం పథకం లబ్ధిదారుల జాబితాలో 41 వేల పేర్లు గల్లంతయ్యాయి. గతేడాది కాపు నేస్తం కింద 3,27,244 మందికి లబ్ధి అందించారు. వచ్చే నెలలో అందించే మూడో విడత సాయానికిగాను వీరిలో 2,85,769 మంది పేర్లను మాత్రమే ఈకేవైసీ నమోదుకు (లబ్ధిదారుల నుంచి వేలిముద్ర తీసుకునేందుకు) క్షేత్రస్థాయికి పంపించారు. గతేడాది లబ్ధి పొందిన జాబితాలోని 41,475 మంది పేర్లు ఈసారి లేవు. వీరు పేర్లు ఎందుకు తొలగించిందీ స్పష్టత ఇవ్వకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది.

కాపు నేస్తం పథకం మూడో విడత సాయానికి అర్హుల ఎంపికను ప్రభుత్వం గతానికి భిన్నంగా చేపడుతోంది. గతేడాది వరకు పాత లబ్ధిదారుల్లో (అంతకుముందు సంవత్సరం సాయం పొందినవారిలో) ఎవరినైనా అనర్హులుగా గుర్తిస్తే మొదటి దశలోనే అర్హులు, అనర్హుల జాబితాలను వేర్వేరుగా క్షేత్రస్థాయికి పంపి సచివాలయాల్లో ప్రదర్శించేది. అనర్హతకు కారణాన్ని స్పష్టంగా పేర్కొనేది. అందులో అర్హులు ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించేది. వారి అర్హతను నిబంధనల మేరకు పరిశీలించి లబ్ధి అందించేది. కానీ అధికారులు గతేడాది లబ్ధి పొందిన కొంతమంది పేర్లను ఈసారి అర్హుల జాబితాలో పంపలేదు. అలాంటివారు ఎవరైనా సచివాలయానికి వస్తే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటూ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు.

ఇతర పథకాల లబ్ధి పొందారని..గతేడాది లబ్ధిదారుల జాబితాలోని 41,475 పేర్లు కొత్త జాబితాలో లేవు. ఇందులో 60 ఏళ్ల పైబడిన వారు, చనిపోయినవారిని తీసేసినా గల్లంతైన వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. వీరిలో కొంతమందికి ఇతర సంక్షేమ పథకాల కింద సాయం అందిందనే కారణంగా కాపు నేస్తాన్ని నిలిపేసినట్లు సమాచారం. చిత్తూరు జిల్లాలో గతేడాది 6,165 మందికి కాపు నేస్తం సాయాన్ని అందిస్తే ఈసారి వీరిలో 5,503 మంది పేర్లతోనే జాబితాను ఉన్నతాధికారులు పంపించారు.

తలలు పట్టుకుంటున్న సంక్షేమ కార్యదర్శులు..తమ పేర్లు ఎందుకు జాబితాలో రాలేదని లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్లి సంక్షేమ కార్యదర్శుల్ని ప్రశ్నిస్తున్నారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తే.. ఇప్పటికే రెండు విడతల సాయాన్ని పొందాక మళ్లీ దరఖాస్తేమిటని నిలదీస్తున్నారు.. దీంతో కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. జాబితాలో పేర్లు రాని వారు దరఖాస్తు చేసుకునేందుకు నవశకం బెనిఫిషరీ మేనేజ్‌మెంట్‌ పేరుతో ప్రత్యేక పోర్టల్‌ తెచ్చారు. ఇందులో వారి వివరాలు నమోదు చేస్తే తిరిగి ఆరు దశల తనిఖీ చేస్తారు. ఆ తర్వాత అర్హత ఉంటే పథకం సాయాన్ని అందిస్తారు. లేకుంటే అనర్హులుగా పేర్కొంటారు.

కొత్తగా 21 వేల మంది దరఖాస్తు..కాపు నేస్తం పథకానికి శుక్రవారం నాటికి కొత్తగా 21,617 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాకినాడ జిల్లాలో అత్యధికంగా 2,458 మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్త దరఖాస్తుల సీక్వరణకు ఈ నెల 30 వరకు గడువిచ్చారు. శుక్రవారం వరకు అర్హులుగా (గతేడాది లబ్ధిదారులు, కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు) గుర్తించిన వారి జాబితాను శనివారం సచివాలయాలకు పంపుతామని ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చారు. తుది జాబితాను జులై 7న ప్రకటించనున్నారు. అప్పటికి అర్హులుగా ఉన్నవారికి మాత్రమే కాపు నేస్తం సాయాన్ని అందిస్తారు.

ఇదీ చూడండి:అమరావతి భూముల విక్రయానికి సీఆర్డీఏ ప్రణాళిక

ఉద్యోగం పేరుతో యువతిని నమ్మించి వేధింపులు.. ఒకరి అరెస్టు..

ABOUT THE AUTHOR

...view details