ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

6 నెలలకోసారి జగనన్న తోడు : సీఎం జగన్ - Jagananna Thodu Scheme latest news

ఆరు నెలలకోసారి జగనన్న తోడు పథకంలో చిరు వ్యాపారులకు సున్నా వడ్డీకి రుణాలు అందిస్తామని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ఈ పథకం రెండో విడత కింద 3.70 లక్షల మంది చిరు వ్యాపారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేల చొప్పున రూ.370 కోట్ల రుణం జమ చేశారు

6 నెలలకోసారి జగనన్న తోడు : సీఎం జగన్
6 నెలలకోసారి జగనన్న తోడు : సీఎం జగన్

By

Published : Jun 8, 2021, 6:23 AM IST

Updated : Jun 9, 2021, 5:29 AM IST

ఆరు నెలలకోసారి జగనన్న తోడు పథకంలో చిరు వ్యాపారులకు సున్నా వడ్డీకి రుణాలు అందిస్తామని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ఈ పథకం రెండో విడత కింద 3.70 లక్షల మంది చిరు వ్యాపారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేల చొప్పున రూ.370 కోట్ల రుణం జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... అర్హత కలిగిన వారు ఎవరైనా మిగిలి ఉంటే సమీపంలోని సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఆయా దరఖాస్తులను మూడు నెలలకోసారి పరిశీలించి ఆరు నెలలకోసారి సున్నా వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని, ఇందులో సమస్యలు, సందేహాలున్నా 1902 నంబరుకు ఫోన్‌ చేస్తే ప్రభుత్వం సహకరిస్తుందని వివరించారు.


పేదవాడికి ఉపయోగపడకపోతే విఫలమైనట్లే
‘వ్యవస్థలు, బ్యాంకులను పేదవాడికి ఉపయోగపడే పరిస్థితిలోకి తీసుకుని రాలేకపోతే ప్రభుత్వాలు విఫలమైనట్లు భావించాలి. చిన్న వ్యాపారాలు చేసుకునే పేదలకు బ్యాంకులు రుణాలివ్వకపోవడంతో ప్రైవేటు వ్యక్తులకు రూ.100కు రోజుకు రూ.పది వడ్డీ చెల్లించలేక జీవితాన్ని సాగిస్తున్న అనేక మందిని పాదయాత్రలో చూశా. వారి తలరాతలను మార్చే అవకాశం దేవుడు ఇస్తే... కచ్చితంగా మారుస్తానని అప్పుడు చెప్పా. ప్రస్తుతం సంతృప్తి స్థాయిలో అమలు చేస్తుండటం సంతోషాన్ని కలిగిస్తోంది. గత ఏడాది బ్యాంకులిచ్చిన రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది. మొత్తం 9.05 లక్షల మంది దరఖాస్తు చేస్తే తొలి విడతలో 5.35 లక్షల మందికే రుణాలిచ్చాయి. బ్యాంకులపై ఒత్తిడి తెచ్చి వారి నుంచే కాకుండా ఆప్కాబ్‌, స్త్రీ నిధి వంటి వాటిద్వారా మిగిలిన వారికి ప్రస్తుతం ఇప్పిస్తున్నాం’ అని సీఎం వివరించారు.


వీరు దరఖాస్తు చేసుకోవచ్చు
‘గ్రామాలు, పట్టణాల్లో సుమారు పది అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పు స్థలం, అంతకన్నా తక్కువ స్థలంలో శాశ్వత, తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారంతా ఈ పథకానికి అర్హులు. అదే విధంగా పుట్‌పాత్‌లు, వీధుల్లో తోపుడుబళ్లపై వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్ముకునే వారు, రోడ్లు పక్కన టిఫిన్‌ సెంటర్లు, గంపలు, బుట్టల్లో వస్తువులు అమ్ముకునే వారు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సాంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, ఇత్తడి పనిచేసేవారు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు చేసేవారు, లేస్‌, కళంకారీ, తోలుబొమ్మలు, కుమ్మరి, తదితర వృత్తులపై ఆధారపడిన చిరు వ్యాపారులందరికీ రూ.10వేల వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు.


సకాలంలో రుణాలు చెల్లిస్తే వడ్డీ జమ
‘రుణాలను వడ్డీతో సహా సకాలంలో బ్యాంకులకు చెల్లిస్తే కట్టిన వడ్డీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. బ్యాంకులు కూడా చిరు వ్యాపారులు తిరిగి ఎంత చెల్లించారో... అంతే రుణం మళ్లీ ఇస్తాయి. తొలి విడతలో 5.35 లక్షల మందికి రుణాలిచ్చారు. వాటిని సకాలంలో చెల్లించిన లబ్ధిదారుల ఖాతాల్లోకి వడ్డీ సొమ్ము ఒకటి, రెండు రోజుల్లో జమ అవుతాయి’ అని సీఎం జగన్‌ ప్రకటించారు. వినూత్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో ఇతర రాష్ట్రాలకు సీఎం జగన్‌ ఆదర్శంగా నిలుస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిరు వ్యాపారులకు సున్నా వడ్డీకి రుణాలు మిగతా రాష్ట్రాల కంటే ఏపీలోనే అత్యధికంగా తొమ్మిది లక్షల మందికి అందిస్తున్నారని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) కన్వీనర్‌ బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. యూపీలో 6 లక్షలు, ఏపీ కంటే పెద్ద రాష్ట్రాలైన కర్ణాటకలో లక్ష, తమిళనాడులో 3 లక్షల మంది లబ్ధి పొందుతున్నారన్నారు.

వాహనమిత్ర దరఖాస్తుకు నేడూ అవకాశం

ఈనాడు, అమరావతి: వాహనమిత్ర పథకానికి ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లు దరఖాస్తు చేసుకునేందుకు బుధవారం కూడా అవకాశం కల్పించినట్లు రవాణాశాఖ మంత్రి పేర్ని నాని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు గడువు మంగళవారంతో ముగియాల్సి ఉండగా, సర్వర్‌లో సాంకేతిక లోపం కారణంగా పలువురు దరఖాస్తు చేయలేకపోయారు. దీంతో బుధవారం కూడా అవకాశం ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

Covid Third Wave: పీడియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేయండి: సీఎం జగన్

Last Updated : Jun 9, 2021, 5:29 AM IST

ABOUT THE AUTHOR

...view details