YSR EBC NESTHAM FUNDS: అగ్రవర్ణాల్లోనూ పేదలు ఉన్నారని, వారికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ అమలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారతకు, వారి ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందన్న సంకల్పంతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చామన్నారు. ఇది ఎన్నికల వాగ్దానం కాదని, మేనిఫెస్టోలోనూ చెప్పలేదని, పేదవారు ఎక్కడున్నా మంచి చేయాలనే ఆలోచనతోనే ఈ బాధ్యత తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ప్రారంభించారు. 3.93 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ.589 కోట్ల నగదును బటన్ నొక్కి జమ చేశారు. అనంతరం మాట్లాడుతూ... ‘ఈ పథకం కింద రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ తదితర అగ్రవర్ణాల్లోని 45-60 ఏళ్ల మధ్య ఉన్న పేద మహిళలకు మేలు చేస్తున్నాం. వీరికి ఏటా రూ.15వేల చొప్పున మూడేళ్లపాటు అందిస్తాం. గృహిణి బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. వారి ముఖంలో సంతోషం ఉంటేనే ఇంట్లో అందరికీ ఆనందం ఉంటుంది’ అని గుర్తుచేశారు.
33 లక్షల మందికి చేయూత
‘వైఎస్సార్ చేయూత ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు నేస్తం పథకాల కింద కాపు, బలిజ, ఒంటరి మహిళలకు(45-60 ఏళ్ల మధ్య ఉన్న వారికి) ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తున్నాం. ఈ రెండు పథకాల కింద దాదాపు 29 లక్షల మంది మహిళలకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాం. ‘ఈబీసీ నేస్తం’తో కలిపితే దాదాపు 33 లక్షల మంది మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తున్నాం’ అని వెల్లడించారు.