ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ ప్రారంభం - ys vivekanandareddy murder news

ys-viveka-murder-case-cbi-investigation
ys-viveka-murder-case-cbi-investigation

By

Published : Jul 18, 2020, 2:10 PM IST

Updated : Jul 19, 2020, 4:29 AM IST

14:04 July 18

ఏడాది నుంచి మిస్టరీగా మిగిలిన మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసును ఛేదించడానికి సీబీఐ రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాలతో తొలిసారిగా కడప జిల్లాలో అడుగు పెట్టిన సీబీఐ అధికారులు... కేసు పూర్వపరాలను పరిశీలిస్తున్నారు. తొలి రోజంతా కడప జిల్లా కేంద్రంలోనే మకాం వేసి.. హత్య కేసుకు సంబంధించిన వివరాలను సంబంధిత సిట్ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. రేపటి నుంచి పులివెందులలో క్షేత్రస్థాయి దర్యాప్తు ప్రారంభించే వీలుందని తెలుస్తోంది.

వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ ప్రారంభం

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వై.ఎస్.వివేకానందరెడ్డి 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో దారుణహత్యకు గురయ్యారు. ఈ కేసులో హంతకులెవరనేది ఇంతవరకు పోలీసులు తేల్చలేదు. వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించడంతో... న్యాయస్థానం కేసును సీబీఐకి అప్పగించింది. నాలుగు నెలలకు ముందు హైకోర్టు ఆదేశించినా... కరోనాతో లాక్ డౌన్ కారణంగా సీబీఐ అధికారులు దర్యాప్తు మొదలు పెట్టలేదు. ఎట్టకేలకు ఇవాళ ఏడుగురు సీబీఐ అధికారులు కడపకు చేరుకున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు. అనంతరం కడప ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మకాం వేశారు.

వివేకా హత్యకేసును దర్యాప్తు చేస్తూ... సిట్​కు ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల డీఎస్పీ వాసుదేవన్.. సీబీఐ అధికారులతో కాసేపు సమావేశమై వెళ్లిపోయారు. రేపటి నుంచి పులివెందులకు వెళ్లి క్షేత్రస్థాయి దర్యాప్తు ప్రారంభించే వీలుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.  వివేకా హత్యపై పులివెందుల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ కేసు వివరాలు... సిట్ అధికారులు ఇప్పటివరకు చేసిన దర్యాప్తు వివరాలను పోలీసులు సీబీఐకి అప్పగించే వీలుంది. వివేకా హత్యకు గురైన ఇంటిని సీబీఐ అధికారులు పరిశీలించే అవకాశం ఉంది.

సీబీఐ అధికారులు రంగంలోకి దిగడంతో జిల్లాలో మళ్లీ అలజడి మొదలైంది. వివేకా హత్య కేసు మొదట్లో రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. వైకాపా, తెదేపా అగ్రనాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. దరిమిలా కేసును ఛేదించడానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసినా నిందితులెవ్వరన్నదీ గుర్తించలేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రెండు సిట్ లను ఏర్పాటు చేసినా ఫలితం శూన్యం. జిల్లా నుంచి ఇద్దరు ఎస్పీలు మారినా కేసు తేల్చలేక పోయారు. వివేకా హత్య జరిగిన ప్రదేశంలో కొందరు సాక్ష్యాలను తారుమారు చేసే విధంగా రక్తపు మరకలు తుడిచేయడం, మృతదేహానికి కట్టు కట్టడం, హడావుడిగా ఆసుపత్రికి తరలించడం చేశారు. వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ ఉదయమే లభ్యమైనా... సాయంత్రం వరకు పోలీసులకు ఇవ్వకపోవడంలో మతలబు ఏమిటనే ప్రశ్నలు సందేహంగా ఉన్నాయి.  

సాక్ష్యాలు తారుమారు చేశారనే ఆరోపణలపై వివేకానందరెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి, వంటమనిషి కుమారుడు ప్రకాశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ హత్య చేసిందెవరనేది ఇంతవరకు నిగ్గు తేల్చలేదు. ఈ కేసులో కొంతమందిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించారు. వై.ఎస్.అవినాశ్ రెడ్డి, వై.ఎస్.భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి తోపాటు తెదేపా నాయకులు బీటెక్ రవి, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డిలతో సహా 16 మందిపై అనుమానం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టుకు కేసును సీబీఐకి అప్పగించింది.  

సీబీఐ ముందుగా అనుమానితులను  విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసు విషయంలో సిట్ అధికారులు 1300 మంది అనుమానితులను ఇప్పటికే విచారించారు. ఆ వివరాలన్నీ సీబీఐకి అప్పగించనున్నారు. ఈ కేసులో కీలకంగా ఉన్న సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి గత సెప్టెంబరులో ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనం కల్గించింది. అప్పటి నుంచి కేసు దర్యాప్తు మందగించింది.

ఇదీ చదవండి :   వేదికలు వెలవెల.. రూ.వేల కోట్ల నష్టం


 

Last Updated : Jul 19, 2020, 4:29 AM IST

ABOUT THE AUTHOR

...view details