తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపించడమే తన లక్ష్యమని వైఎస్ షర్మిల పునరుద్ఘాటించారు. వైఎస్సార్ కులమతాలకు అతీతంగా పాలించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. లోటస్‌పాండ్‌లో రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల నేతలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న షర్మిల... జై తెలంగాణ... జోహార్ వైఎస్సార్ అంటూ నినదించారు. పేదలు, రైతులు, విద్యార్థులకు ఉపయోగపడేలా వైఎస్సార్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చారని... ప్రజల ఆశీర్వాదంతో నాటి స్వర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుందామన్నారు.
వైఎస్సార్ ప్రేమించిన విధంగానే తెలంగాణ ప్రజలు కూడా ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారని షర్మిల పునరుద్ఘాటించారు. అందుకే మహానేత మరణించినప్పుడు ప్రాణాలొదిలేసిన వాళ్లలో తెలంగాణ వాళ్లు ఉన్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైఎస్ అభిమానుల నుంచి పలు అంశాలపై అభిప్రాయాలను సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని పేపర్లను ఇచ్చి సమాధానాలను కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వైఎస్సార్ బిడ్డగా... రాజకీయ నిర్ణయం తీసుకుంటున్న తరుణంలో సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు.. రాష్ట్రంలో వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు... జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఉన్న అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.