Youth in drug trap: హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు వాహనం నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. అతడు గంజాయి మత్తులో ఉన్నట్లు చికిత్సచేసే సమయంలో వైద్యులు గుర్తించారు. అప్పటివరకు తమ బిడ్డకు ఆ అలవాటు ఉన్నట్లు తెలుసుకోలేని తల్లిదండ్రులు నివ్వెరపోయారు. వైద్యుల సూచన మేరకు కుమారుడిని పునరావాస కేంద్రంలో చేర్పించారు. అతడు మూడేళ్ల క్రితమే సిగరెట్లు, మద్యం తాగడం మొదలుపెట్టి ప్రస్తుతం గంజాయితోపాటు ఇతర మాదకద్రవ్యాల్ని తీసుకుంటున్నట్టు తేలింది. తరచూ గోవా నుంచి మాదకద్రవ్యాలను తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్టు అతడు నిపుణుల కౌన్సెలింగ్‌లో వెల్లడించాడని తెలుసుకుని తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
జడలు విప్పుతున్న మత్తు మహమ్మారి కారణంగా ఇలాంటి అనుభవం ఎందరో తల్లిదండ్రులకు ఎదురయ్యే ప్రమాదం ముంచుకొస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో మత్తు పదార్థాల వినియోగం భారీగా పెరగడంతో యువత, ముఖ్యంగా ఇంజినీరింగ్ విద్యార్థులు ఎక్కువగా మాదకద్రవ్యాల బారినపడ్డారు. లాక్‌డౌన్‌తో హైదరాబాద్ నుంచి గ్రామాలకు వెళ్లిన ఇలాంటివారు..అక్కడి స్నేహితులకూ వీటిని అలవాటుచేశారు. ‘సులభంగా, చవగ్గా లభ్యమవడంతో మాదకద్రవ్యాల వ్యసనానికి గంజాయి గేట్‌వేలా మారిపోయిందని’ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇలాంటివి మీ ఇంట్లో జరుగుతున్నాయా?
* పిల్లలు ఇంట్లో తీసుకునే డబ్బులకు కచ్చితమైన లెక్కలు అడగాలి. తరచూ సాధారణం కంటే ఎక్కువ డబ్బులు అడుగుతుంటే అప్రమత్తమై ఆరా తీయాలి. ఇంటికి దూరంగా ప్రైవేటు గదుల్లో, వసతిగృహాల్లో ఉంటే వాటిని ఆకస్మికంగా సందర్శిస్తూ పరిస్థితుల్ని గమనించాలి. ఇంటికి తరచూ ఆలస్యంగా వస్తున్నప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడో(మాట తడబాటు, కళ్లు ఎర్రబారడం, మగతగా అనిపించడం వంటివి) గమనించాలి.
* విద్యార్థుల బ్యాగుల్లో ఒ.సి.బి.పేపర్, లైటర్ తదితర వస్తువులుంటే గంజాయి తాగుతున్నట్టు అనుమానించాలి. ఎక్కువగా తినడం, ఎక్కువగా నిద్ర పోవడమూ గంజాయి తాగే వారి ప్రాథమిక లక్షణంగా గుర్తించాలి. బ్యాక్‌లాగ్స్ పెరిగినా కారణాలను అన్వేషించాలి.