ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అద్భుత చారిత్రక శిల్పకళకు ఆలవాలం.. ఓరుగల్లు నగరం - Historical treasures in warangal

కళలకు కాణాచిగా సాంస్కృతిక రాజధానిగా తెలంగాణలోని ఓరుగల్లు నగరం అనాదిగా ప్రసిద్ధం.. అద్భుత చారిత్రక శిల్పకళా సంపదకు ఈ ప్రాంతం ఆలవాలం. అబ్బురపరిచే ఆలయాలతో పాటు ప్రాచీన ఆయుర్వేద వైద్యానికీ ఈ నగరం కేంద్రంగా భాసిల్లింది. కాలక్రమంలో కనుమరుగైన ఆ వైభవాన్ని, చారిత్రక ఆనవాళ్లను గుర్తించి మళ్లీ వెలుగులోకి తెస్తున్నారు కొందరు ఔత్సాహికులు. చారిత్రక ప్రాంతాలను శోధిస్తూ కొత్త విషయాలను ప్రపంచానికి చాటి చెబుతున్నారు.

WARANGAL
WARANGAL

By

Published : Mar 14, 2021, 12:30 PM IST

పాతికేళ్ల యువ పరిశోధకుడు అరవింద్‌ ఆర్య పగిడె.. పురావస్తు ప్రాంతాలకు చెందిన ఎన్నో కొత్త విషయాలను ప్రాచుర్యంలోకి తెచ్చారు. ముఖ్యంగా ములుగు సమీపంలోని దేవునిగుట్ట గురించి అరవింద్‌ లోతుగా అధ్యయనం చేశారు. కొన్నేళ్ల క్రితం వరకు ఈ అద్భుత ప్రాచీన ఆలయం గురించి ప్రపంచానికి తెలియదు. స్థానిక యువకుడి ద్వారా దీని ఘనతను తెలుసుకున్న అరవింద్..‌ ఈ గుట్టను క్షుణ్నంగా పరిశీలించారు. కాంబోడియాలోని అంకోర్‌వాట్‌ ఆలయాన్ని పోలి ఉన్న దేవునిగుట్ట అంతకన్నా ప్రాచీనమైనదని తేల్చారు. ఈ విశేషాలను ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేయగా జర్మనీ, అమెరికా, యూకే నుంచి నలుగురు చరిత్ర పరిశోధకులు ఆలయ సందర్శనకు తరలివచ్చారు. వీరిలో ప్రొ।। వాగ్నర్‌, ప్రొ।। ఆడం హార్డీలు వర్సిటీల్లో చరిత్రను బోధించే ఆచార్యులు. ఇక్కడి ఆలయ ఘనతను పరిశీలించి అబ్బురపోయారు. జయశంకర్‌ జిల్లా రేగొండ మండలంలోని ఆదిమానవుల నాటి చిత్రలేఖనాలున్న పాండవుల గుట్టపై సుమారు ఏడో శతాబ్దం నాటి ఉత్పత్తి పిడుగు తెలుగు శాసనాన్నీ అరవింద్‌ ఇటీవలే వెలికితీశారు.

ఎక్కడెక్కడి నుంచో..

పురావస్తు శాఖ విశ్రాంత అధికారి విజయవాడకు చెందిన ఈమని శివనాగేశ్వరెడ్డి కాకతీయుల ఆలయాల గురించి ఇటీవలే కొత్త విషయం కనుగొన్నారు. ములుగు జిల్లాలోని రామప్ప, కోటగుళ్లు, రామానుజపురం ఆలయాల నిర్మాణానికి వినియోగించిన రాయి వెల్దుర్తిపల్లి వద్దనున్న పెద్ద గుట్టను తొలచి తెచ్చారని కనిపెట్టారు. కేంద్ర పురావస్తు శాఖ విశ్రాంత ఉద్యోగి కన్నబాబు కాకతీయుల ఆలయాలపై సర్వేక్షణ్‌ ప్రాజెక్టును చేపట్టారు. హన్మకొండలోని పద్మాక్షి గుడి నిర్మించి ఇప్పటికి 905 ఏళ్లు అయ్యిందని ఆయన తేల్చారు. కాకతీయుల యుద్ధ స్థావరాలను సైతం ఆయన కనుగొన్నారు. ఆయుష్‌ విభాగానికి చెందిన భారత జాతీయ చికిత్స విజ్ఞాన వారసత్వ కేంద్రం (నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఇండియన్‌ మెడికల్‌ హెరిటేజ్‌) అధికారుల బృందం హన్మకొండ అగ్గలయ్య గుట్ట, రామప్ప ఆలయం ప్రాంతాల్లో పరిశోధనలు చేసింది. భారతీయ ప్రాచీన ఆయుర్వేద చికిత్స విధానానికి సంబంధించి కీలక ఆధారాలను సేకరించి లోతైన విశ్లేషణ చేస్తోంది.

ఇంట్లోనే మ్యూజియం..

జనగామ వాసి రెడ్డి రత్నాకర్‌రెడ్డి వృత్తిరీత్యా అధ్యాపకుడు. ప్రవృత్తి మాత్రం చరిత్ర శోధనే. తాజాగా.. హన్మకొండలోని అగ్గలయ్య గుట్టపై ప్రాచీన ఆయుర్వేదంలో ఉపయోగించిన పరికరాలను ఆయన కనుగొన్నారు. జనగామ జిల్లాలో వందలాది ఊళ్లను సందర్శించి అనేక ఆదిమానవుల సమాధులను గుర్తించారు. చెమటోడ్చి సేకరించిన వందలాది ప్రాచీన శిలలతో రత్నాకర్‌రెడ్డి ఇంట్లోనే పురావస్తు మ్యూజియం ఏర్పాటు చేశారు. జనగామ చుట్టుపక్కల 50కి పైగా శాసనాలను వెలుగులోకి తెచ్చారు. ప్రాచీన గుట్టలను క్వారీలకు ఇస్తోండడంతో చారిత్రక ఆనవాళ్లు చెదిరిపోతున్నాయని ఆయన ఆందోళన చెందుతున్నారు.

దంత వైద్యురాలి సాహసం..

వరంగల్‌ వాసి గుడిబోయిన హిందోళ దంత వైద్యురాలు. పురావస్తు పరిశోధన అంటే ప్రాణం. వీలున్నపుడల్లా ప్రాచీన ఆలయాలకు వెళ్లి కొత్త విషయాలను కనుగొంటున్నారు. ధర్మసాగర్‌ మండలం ముప్పారంలోని ముప్పిరినాథ స్వామి ఆలయంలో ఈమె కనుగొన్న విశ్వకర్మ విగ్రహం.. దేశంలోనే అత్యంత పురాతనమైనదిగా చెబుతున్నారు. చారిత్రక అంశాలపై మక్కువతో ఎంఏ హిస్టరీ చదువుతున్నారు. చారిత్రక ప్రాంతాలు, ఆలయాల్లోని శిల్పసంపదలో నిక్షిప్తమైన సంగీత, నృత్య రీతులపై తెలంగాణ సంగీత నాటక అకాడమీకి ఈమె పరిశోధన పత్రం సమర్పించారు.

ABOUT THE AUTHOR

...view details