ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నగరపాలక, పురపాలక సంఘాల్లో 93 చోట్ల వైకాపా ఏకగ్రీవం!

నగరపాలక, పురపాలక సంఘాల్లో చాలా చోట్ల వైకాపా అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. ముఖ్యంగా గుంటూరు, కడప జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. వైకాపా నాయకుల బెదిరింపుల వల్లే అక్కడ నామినేషన్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ycp will get 93 wards/ divisions in muncipalities and city corporation
ycp will get 93 wards/ divisions in muncipalities and city corporation

By

Published : Mar 14, 2020, 10:06 AM IST

నగరపాలక, పురపాలక సంఘాల ఎన్నికల్లోనూ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై దాడులు, బెదిరింపుల పర్వం కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా 93 డివిజన్లు/వార్డుల్లో వైకాపా మాత్రమే నామినేషన్లు వేసింది. అవన్నీ వైకాపాకి ఏకగ్రీవమైనట్లే.

గుంటూరు జిల్లా మాచర్లలో మొత్తం 31 వార్డుల్లోనూ వైకాపా మాత్రమే నామినేషన్లు వేసింది. కడప జిల్లా పులివెందులలో 33 వార్డులకు 51 నామినేషన్లు పడ్డాయి. అవన్నీ వైకాపా అభ్యర్థులు వేసినవే. ఇక్కడ మొత్తం 33 వార్డులూ ఏకగ్రీవం కానున్నాయి. వైకాపా నాయకుల బెదిరింపులవల్లే అక్కడ నామినేషన్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాయచోటిలో 4 చోట్ల వైకాపా అభ్యర్థులే నామినేషన్లు వేశారు.

చిత్తూరు జిల్లా పుంగనూరులో 31 వార్డులకుగానూ 14 చోట్ల వైకాపా అభ్యర్థులే నామినేషన్‌ వేశారు. తెదేపా తరపున నామినేషన్లు వేసేందుకు వచ్చేవారిని కొందరు దారిలోనే అడ్డుకుని పత్రాలను చించేశారు. తిరుపతి కార్పొరేషన్‌లో 5 డివిజన్లలో వైకాపా అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. వాటిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కుమారుడు అభినయ్‌రెడ్డి నామినేషన్‌ వేసిన నాలుగో డివిజన్‌ కూడా ఉంది.

నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని 20వ వార్డులో వైకాపా అభ్యర్థి మాత్రమే నామినేషన్‌ వేశారు. కర్నూలు జిల్లా డోన్‌లో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెదేపా ప్రకటించింది. అక్కడ 32 వార్డులకుగానూ 12 చోట్ల మాత్రమే తెదేపా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఒక వార్డులో కేవలం వైకాపా మాత్రమే నామినేషన్‌ వేసింది. ఆత్మకూరు మున్సిపాలిటీలోని 15వ వార్డులోనూ వైకాపా అభ్యర్థి మాత్రమే నామినేషన్‌ వేశారు. విశాఖ జిల్లా యలమంచిలిలో 15వ వార్డులో, తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో 16వ వార్డులో, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 16వ వార్డులోనూ వైకాపా అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి.

చివరి రోజు పట్టణాల్లో 15,867 నామినేషన్లు
పురపాలక, నగరపాలక సంస్థల్లో వివిధ స్థానాల్లో పోటీకి చివరి రోజు శుక్రవారం భారీగా 15,867 నామినేషన్లు దాఖలయ్యాయి. పురపాలక, నగర పంచాయతీల్లో 10,554, నగరపాలక సంస్థల్లో 5,313 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడు రోజుల్లో కలిపి మొత్తం 18,249 నామినేషన్లు నమోదయ్యాయి.

ఇదీ చదవండి:నామినేషన్​ ఉపసంహరణకు రూ.5 లక్షలు

ABOUT THE AUTHOR

...view details